World Cup: ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ షెడ్యూల్‌ మార్పునకు ఒప్పుకున్న పాకిస్థాన్ బోర్డు!

  • అక్టోబర్‌‌15కు బదులు అక్టోబర్‌‌14న జరగనున్న దాయాదుల పోరు
  • హైదరాబాద్‌లో అక్టోబర్‌‌12న శ్రీలంక–పాక్‌ మ్యాచ్‌ ఆ నెల 10కి మార్పు
  • సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్న ఐసీసీ
Pakistan agree to World Cup schedule change to play India on October 14 Pakistan will now play Sri Lanka

భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు సంబంధించిన రెండు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చేందుకు పాకిస్థాన్ క్రికెట్‌బోర్డు (పీసీబీ) అంగీకరించింది. ప్రపంచ కప్‌లో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్–పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్‌ 15న కాకుండా 14న జరగనుంది. అహ్మదాబాద్‌లో దేవీ నవరాత్రుల భద్రతా కారణాల కారణంగా ఈ మార్పునకు పీసీబీ ఒప్పుకుంది. అయితే దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఒక్క మ్యాచ్‌ను మార్చడం వల్ల షెడ్యూల్‌ మొత్తంపైనా కొంత ప్రభావం పడనుంది. భారత్–పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌14న నిర్వహిస్తే, శ్రీలంక–పాక్‌జట్ల మధ్య అక్టోబర్‌12న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ను రెండు రోజులు ముందుకు అంటే అక్టోబర్ 10కి మార్చనున్నారు. 

దీనివల్ల భారత్‌తో కీలకమైన మ్యాచ్‌కు సన్నద్ధం అయ్యేందుకు పాకిస్థాన్ జట్టుకు తగినంత సమయం లభించనుంది. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 14న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రోజు చెన్నైలో బంగ్లాదేశ్–న్యూజిలాండ్, ఢిల్లీలో ఆఫ్ఘానిస్థాన్–ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. భారత్–పాక్ పోరు షెడ్యూల్ మార్పు కారణంగా ఈ రెండింటిలో ఒక మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా అక్టోబర్ 13నే నిర్వహించే అవకాశం ఉంది. ఈ వారాంతంలోగా సవరించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించనుంది

More Telugu News