Nithya Sasi: 75 ఏళ్ల మాజీ సైనికుడిపై కేరళ టీవీ నటి వలపు వల.. వీడియోలు తీసి రూ. 11 లక్షల దోపిడీ!

Police arrest TV actress and her friend accused of honey trapping
  • డబ్బుల కోసం స్నేహితుడితో కలిసి నటి అడ్డదారులు
  • తియ్యని మాటలతో బురిడీ
  • ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపు
  • మరిన్ని డబ్బుల కోసం బెదిరించి కటకటాల పాలు
75 ఏళ్ల ఓ మాజీ సైనికోద్యోగికి వలపు వల విసిరిన కేరళ టీవీ నటి రూ. 11 లక్షలు దండుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పలు సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి డబ్బుల కోసం తన స్నేహితుడితో కలిసి కేరళ యూనివర్సిటీలో పనిచేస్తున్న మాజీ సైనికుడిని ఎంచుకుంది. ఇల్లు అద్దెకు కావాలంటూ మే 24న ఆయనకు ఫోన్ చేసింది. అది మొదలు పదేపదే ఫోన్  చేస్తూ పరిచయం పెంచుకుంది. స్నేహం పెరిగిన తర్వాత ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. 

ఆయనతో చనువుగా ఉంటూ దుస్తులు విప్పించింది. అప్పటికే ఆ ఇంట్లో నక్కి ఉన్న బినూ అనే ఆమె స్నేహితుడు వృద్ధుడి నగ్న ఫొటోలు తీశాడు. ఆపై వాటిని చూపించి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. దీంతో బాధిత వృద్ధుడు రూ. 11 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ ఇంకా డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఈ నెల 18న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన సలహా మేరకు ఇంటికొచ్చి డబ్బులు తీసుకోవాల్సిందిగా నిందితులకు చెప్పాడు. ఇంటి వద్ద మాటు వేసిన పోలీసులు నిందితులు రాగానే అరెస్టు చేశారు. నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nithya Sasi
Kerala
Honeytrap

More Telugu News