Rice Export: బియ్యం ఎగుమతులపై ఇండియా బ్యాన్ ఎత్తేయాలి: ఐఎంఎఫ్

We Encourage India To Removal Of Restrictions On Rice Export Says IMF
  • ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న బియ్యం ధరలు 
  • గ్లోబల్ ఇన్ ఫ్లేషన్ కు దారితీస్తుందని ఆందోళన
  • సాధ్యమైనంత త్వరగా నిషేధం ఎత్తేయాలని భారత్ కు సూచన
బియ్యం ఎగుమతులపై భారత దేశం విధించిన నిషేధంతో గ్లోబల్ ఇన్ ఫ్లేషన్ (అంతర్జాతీయ ద్రవ్యోల్బణం) ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో బియ్యం కొరత ఏర్పడిందని పేర్కొంది. అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు పలు దేశాల్లో బియ్యం కొనుగోలుకు జనం బారులు తీరుతున్నారని వెల్లడించింది. దీంతో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయ అవసరాల కోసమే భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై బ్యాన్ విధించిందనే విషయం తమకు తెలుసని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పీరే అలివర్ గౌరించాస్ పేర్కొన్నారు.

అయితే, ఎకాఎకిన బ్యాన్ విధించడం వల్ల విదేశాలలో బియ్యం కొరత ఏర్పడుతుందని, సడెన్ గా డిమాండ్ పెరగడం వల్ల ధరల్లో ఒడిదుడుకులు ఏర్పడతాయని చెప్పారు. ఇది గ్లోబల్ ఇన్ ఫ్లేషన్ కు దారితీస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో రైస్ పై విధించిన బ్యాన్ ను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేసేలా తాము ఇండియాను ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు.

ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వం రైస్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. నాన్ బాస్మతి రైస్ ఎగుమతులపై బ్యాన్ విధించింది. దేశీయ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, బాస్మతి రైస్, పారాబాయిల్డ్ రైస్ లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వైట్ రైస్ ను అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, థాయ్ లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక తదితర దేశాలకు ఇండియా ఎగుమతి చేస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయంతో అమెరికాలో బియ్యం కోసం డిపార్ట్ మెంట్ స్టోర్ల ముందు జనం బారులు తీరారు.

బియ్యం బస్తాలను అర్జెంటుగా కొని తీసుకెళ్లేందుకు క్యూ కట్టారు. దీంతో డిపార్ట్ మెంట్ స్టోర్లలో తాత్కాలికంగా రైస్ కు కొరత ఏర్పడింది. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బియ్యం కొనుగోలు చేసేందుకు చాంతాడంత క్యూలలో నిల్చున్న జనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Rice Export
Rice Ban
IMF
USA
Australia
Rice Prices

More Telugu News