Ankit Chauhan: పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించి... కొత్త ప్రియుడితో పారిపోయిన యువతి

Woman killed lover with snake bite and eloped with new lover
  • ఉత్తరాఖండ్ లో ఘటన
  • కారు వెనుక సీట్లో విగతజీవుడిలా వ్యాపారవేత్త
  • కాళ్లపై పాము కాట్లు
  • మరో వ్యక్తి మోజులో యువతి ఘాతుకం
  • హతుడి సోదరి ఫిర్యాదుతో బట్టబయలైన హత్యోదంతం
ఉత్తరాఖండ్ లో ఓ యువతి పక్కా ప్లాన్ తో ప్రియుడ్ని అంతమొందించింది. పాముకాటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బట్టబయలైంది.

నైనిటాల్ ప్రాంతంలోని హల్ద్వానీ పోలీసులు జులై 15న ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. కారు వెనుక సీట్లో విగతజీవుడిలా పడివున్న ఆ వ్యక్తిని అంకిత్ చౌహాన్ అనే బిజినెస్ మేన్ గా గుర్తించారు. కారు ఏసీ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీకవడం వల్ల, ఆ విషవాయువును పీల్చి మృతి చెంది ఉంటాడని భావించారు. పోస్టుమార్టంలో అంకిత్ చౌహాన్ కాళ్లపై పాము కాట్లు కనిపించాయి. 

అయితే, అంకిత్ చౌహాన్ సోదరి ఇషా పోలీసులను ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. తన సోదరుడ్ని మహీ ఆర్యా అనే యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ దీపక్ కందపాల్ అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపించింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు మహీ ఆర్యా కాల్ డేటాను విశ్లేషిస్తే, నివ్వెరపోయే సంగతులు బయటపడ్డాయి. 

అంకిత్ చౌహాన్, మహీ ఆర్యా మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు వెల్లడైంది. కాగా, అంకిత్ చౌహాన్ మృతికి కొన్ని రోజుల ముందు రమేశ్ నాథ్ అనే పాములుపట్టే వ్యక్తితో మహీ ఆర్యా పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. పోలీసులు రమేశ్ నాథ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా... అంకిత్ చౌహాన్ ను నాగుపాముతో కాటేయించి చంపిన విషయాన్ని వెల్లడించాడు. 

ఓ వ్యక్తిని పాముకాటుతో చంపితే రూ.10 వేలు ఇస్తానని మహీ ఆర్యా తనను కోరిందని రమేశ్ నాథ్ పోలీసులకు వివరించాడు. పాముకాటుతో చనిపోతే హత్య అని ఎవరూ అనుకోరన్న ఉద్దేశంతో, ఆమె తనను సంప్రదించిందని తెలిపాడు. తన జీవితంలో అంకిత్ చౌహాన్ జోక్యం మితిమీరిపోయిందని, అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు మహీ చెప్పిందని రమేశ్ నాథ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

పాములు పట్టే వ్యక్తి రమేశ్ నాథ్ చెప్పిన వివరాల ప్రకారం... మహీ ఆర్యా, ఆమె నూతన ప్రియుడు దీపక్ కందపాల్ నేపాల్ పారిపోయినట్టు తెలిసింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను నేపాల్ పంపించారు.
Ankit Chauhan
Mahi Arya
Snake Bite
Murder
Police
Uttarakhand

More Telugu News