vangalapudi anitha: మాపై అసభ్యకర పోస్టులు.. జగన్, భారతీరెడ్డిల పైశాచిక ఆనందం: వంగలపూడి అనిత

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి తమపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన
  • భారతీరెడ్డిపై పోస్టులు పెడితే సెమినార్ పెట్టారన్న అనిత
  • సమయం వచ్చే వరకు వేచి చూస్తామని స్పష్టీకరణ
  • సజ్జల భార్గవరెడ్డి చేతికి సోషల్ మీడియా వెళ్లాక మితిమీరిపోయిందని ఆరోపణ
  • అధికారంలోకి వచ్చాక వీళ్లపై ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి
Vangalapudi Anitha fires at YS Jagan government

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి తనపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్‌ను ప్రశ్నిస్తే పోస్టులు పెట్టేవారని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఇవి బాగా పెరిగాయన్నారు. కేవలం తన మీదే కాదని, టీడీపీ నాయకులు లేదా ఇతరులు ఎవరైనా జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వెంటనే సీఐడీ ఇంటికి వస్తుందని, కేసులు పెడతారని మండిపడ్డారు. కానీ వారు పెట్టే పోస్టులు మాత్రం జుగుప్సాకరంగా ఉంటాయన్నారు. పోస్టులు పెట్టినప్పుడు అందరికీ ఒకే న్యాయం ఉండాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు భారతీరెడ్డిపై పోస్టులు పెట్టినప్పుడు ఏకంగా సెమినార్ కండక్ట్ చేశారని, ఇప్పుడు తనపై పోస్టులు పెట్టినప్పుడు ఏం చేయాలని ప్రశ్నించారు. వారు ఎవరో తమకు తెలుసునని, కానీ తాము కూడా సమయం వచ్చేవరకు వేచి చూస్తామన్నారు. మేం సంస్కారం పక్కన పెట్టి రాయాలంటే జగన్ కుటుంబం, ఇంట్లోవాళ్లందరి గురించి రాయవచ్చునని, కానీ అలా చేయలేమన్నారు. తమను అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి బెదిరిస్తుంటారని, తన మొబైల్‌లో 213 బ్లాక్ చేసిన నెంబర్లు ఉన్నాయని వెల్లడించారు. సజ్జల భార్గవరెడ్డి ఎప్పటి నుండి వైసీపీ సోషల్ మీడియాను చేతిలోకి తీసుకున్నాడో.. అప్పటి నుండి ఇవి మితిమీరిపోయినట్లు చెప్పారు.

పోలీసులకు ఇప్పటికే నాలుగైదుసార్లు ఫిర్యాదు చేశామని, కానీ స్పందించడం లేదన్నారు. వీరికంటే జాతీయ మహిళా కమిషన్ చాలా బెటర్ అని, వారు స్పందిస్తున్నారన్నారు. అవసరమైతే న్యాయస్థానాలకు కూడా వెళ్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీళ్లందరిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జగన్ ను ఓ మాట అంటే చాలు మా ఇంట్లోకి వచ్చి చూసినట్లు మాపై పోస్టులు పెడుతుంటే బాధ, పగ ఉంటాయనీ, దీనినే ప్రతీకారం అంటారని, మాపై అంత దారుణంగా పోస్టులు పెడితే ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు. కేవలం నాపైనే కాదని, పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష, ఇంకా సామాన్య టీడీపీ కార్యకర్తలపై కూడా వల్గర్ గా మాట్లాడుతున్నారన్నారు.

రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ ఆమె బయటకే కనిపించడం లేదని, ఇక నాకేం కనిపిస్తుందని అనిత అన్నారు. ఇంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా ఆమె కనిపించడం లేదని, అందుకే మిస్సింగ్ అని వేద్దామనే ఆలోచనతో ఉన్నానని చెప్పారు. ఇటీవల బయటకు వచ్చి అలా మాట్లాడి వెళ్లిపోయారని, హోంమినిస్టర్ అంటే ఆమె హోంకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఆమె ఒక మహిళకు.. ఒక దళితురాలికి కూడా న్యాయం చేయలేకపోయిందన్నారు.

తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆందోళన


మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఇక ఉపేక్షించేది లేదని అనిత అన్నారు. విజయవాడలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ... పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. తనతో పాటు పలువురు మహిళలపై పేటీఎం బ్యాచ్, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. పోలీసులు జగన్ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. అసభ్యకర పోస్టులతో జగన్, భారతిరెడ్డిలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అరాచక ప్రభుత్వంపై మహిళలు అందరూ కలిసి పోరాటం చేయాలన్నారు. మహిళా సంఘాలు కలిసి రావాలని కోరారు. జగన్, హోంమంత్రి, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలను కాపాడాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు.

More Telugu News