yamuna river: ఉప్పొంగిన యమున.. ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం..ఫ్లైఓవర్ల కింద సహాయక శిబిరాలు!

More than 16000 people have been shifted to relief tents
  • హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 88 మంది మృతి
  • పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ భారీ వరదలు
  • కన్నాట్ ప్లేస్ వైపు వెళ్లే ముఖ్యరహదారి జలమయం

యమునా నది పొంగిపొర్లుతుండటంతో ఢిల్లీలో కీలక రహదారులన్నీ జలమయమయ్యాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నది నీటిమట్టం బుధవారం నుండి భారీగా పెరుగుతూ వస్తోంది. దీంతో అధికారులు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ట్రాఫిక్ ను మళ్లించారు. జూన్ నెలలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఉత్తర భారతంలో ఇప్పుడు రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత నెలాఖరున వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు దాదాపు 88 మంది మృత్యువాత పడ్డారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోను భారీ వరదలు వస్తున్నాయి.

గురువారం ఉదయం యమునా నీటి మట్టం మరింత పెరిగింది. బుధవారం నాడు 207.49 మీటర్ల నుండి నేటి ఉదయం 208.46 మీటర్లకు పెరిగింది. ఇది 45 సంవత్సరాలలో అత్యధికం. లోతట్టు ప్రాంతాలు, రహదారులు మునిగిపోయాయి. ఢిల్లీలోని చాలా వీధుల్లో కార్లు, బస్సులు నీటిలో మునిగిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార కేంద్రం కన్నాట్ ప్లేస్ వైపు వెళ్లే ముఖ్య రహదారి కూడా జలమయమైంది.

సీఎం కేజ్రీవాల్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో స్కూల్స్, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించేవారు తప్ప మిగతా వారు ఇంటి నుండి పని చేయవచ్చని తెలిపారు. ప్రయివేటు కార్యాలయ ఉద్యోగులు కూడా ఇంటి నుండి పని చేయాలని చెప్పారు. వరదల కారణంగా ఢిల్లీలోని మూడు నీటి శుద్ధి కేంద్రాలు మూతపడ్డాయి. రెండు రోజుల పాటు నీటి కొరత ఉండే అవకాశముందని తెలిపారు. అత్యవసర సేవలు అందించే వాహనాలు మినహా ఢిల్లీలోకి భారీ వాహనాలను నిషేధించారు.

ఢిల్లీలోని పలు ఫ్లైఓవర్ల కింద ప్రభుత్వం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. దాదాపు 16,000 మందిని ఈ సహాయక శిబిరాల కిందకు చేరవేసింది. పలు ప్రాంతాల్లో విపత్తు సహాయక బృందాలను మోహరించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద పరిస్థితిపై చర్చించేందుకు రాష్ట్ర గవర్నర్, కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీతో చర్చించారు.

  • Loading...

More Telugu News