JP Nadda: తెలంగాణ బీజేపీ నేతలతో నడ్డా సమావేశం... క్రమశిక్షణపై క్లాస్!

  • ఇటీవల తెలంగాణ బీజేపీలో కొద్దిగా అలజడి
  • తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ హైకమాండ్
  • నోవాటెల్ హోటల్ లో తెలంగాణ బీజేపీ నేతలతో మాట్లాడిన నడ్డా
  • కొందరు నేతలు నడ్డాను విడివిడిగా కలిసిన వైనం
JP Nadda held meeting with Telangana BJP leaders

ఇటీవల తెలంగాణ బీజేపీ కొద్దిగా కుదుపులకు గురవడం తెలిసిందే. బండి సంజయ్ అధ్యక్ష పదవిని కోల్పోవడం, ఈటల వ్యవహారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ... ఇలాంటి అంశాలు రాష్ట్ర బీజేపీలో అలజడి రేపాయి. 

ఈ నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి రాష్ట్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిలో కొందరు నడ్డాను విడివిడిగా కలుసుకున్నారు. 

మొత్తమ్మీద... పార్టీలో క్రమశిక్షణే అత్యంత ప్రధాన అంశం అని నడ్డా వారికి స్పష్టం చేశారు. ఇతర అంశాలు ఏవైనా సరే పక్కనపెట్టేయాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే అందరి లక్ష్యం కావాలని కర్తవ్యబోధ చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ అంతర్గత వ్యవహారాలు మునుపెన్నడూ లేనంతగా చర్చకు దారితీశాయని, దీన్ని జాతీయ నాయకత్వం సహించబోదని నడ్డా ఘాటుగా హెచ్చరించారు. పార్టీ జాతీయ స్థాయి పెద్దలు ఇకపై క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తుంటారని, రాష్ట్ర నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని హితబోధ చేశారు. ఒకరిపై ఒకరు బురదచల్లే కార్యక్రమాలు కట్టిపెట్టాలని, పరస్పర ఆరోపణలు చేసుకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని నడ్డా స్పష్టం చేశారు. 

శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News