Bullet Train: భారత్ లో 2027 నాటికి తొలి బుల్లెట్ రైలు

Bullet train will be run in India by 2027
  • దేశంలో హై స్పీడ్ రైళ్ల కోసం ప్రణాళికలు
  • 24 బుల్లెట్ రైళ్ల కొనుగోలుకు బిడ్లు
  • అంచనా వ్యయం రూ.11,000 కోట్లు
  • అహ్మదాబాద్-ముంబయి మధ్య తొలి బుల్లెట్ రైలు! 
భారతీయ రైల్వేలో వేగవంతమైన రవాణాపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే వందేభారత్ పేరిట సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టిన కేంద్రం... హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకువచ్చేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎస్ఆర్ సీఎల్)ను ఏర్పాటు చేసింది. 

భారత్ లో బుల్లెట్ ట్రైన్ లను సాకారం చేసే దిశగా ఎన్ హెచ్ఎస్ఆర్ సీఎల్ కార్యాచరణ రూపొందించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు అహ్మదాబాద్, ముంబయి మధ్య తిరిగే అవకాశాలున్నాయి. 

జపాన్ రైల్వే శాఖ షింకాన్ సెన్ పేరిట ఎన్నో ఏళ్లుగా అత్యంత సమర్థతతో బుల్లెట్ రైళ్లు నడుపుతోంది. ఈ హై స్పీడ్ రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 320 కిలోమీటర్లు. ఇలాంటి బుల్లెట్ రైళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. 

మొత్తం 24 షింకాన్ సెన్ రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది. వాటి అంచనా వ్యయం రూ.11,000 కోట్లు. ప్రధానంగా జపనీస్ సంస్థలనే బిడ్డింగ్ కు పిలుస్తున్నట్టు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, జపాన్ దేశానికి చెందిన సంస్థలకు ఈ షింకాన్ సెన్ రైళ్ల తయారీ, నిర్వహణలో అపార అనుభవం ఉంది. 

బుల్లెట్ రైళ్ల తయారీలో ఇప్పటివరకు హిటాచీ రైల్, కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ సంస్థలు అగ్రగాములుగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ బిడ్డింగ్ లోనూ ఈ రెండు జపనీస్ సంస్థల మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
Bullet Train
Shincansen
India
Japan

More Telugu News