Jagan: ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామా చేస్తున్నారు.. చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

  • మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారన్న జగన్
  • హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ఆరోపణ
  • రాష్ట్రంలో తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయని మండిపాటు
  • అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్
cm jagan fires on chandrababu in chittoor public meeting

హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ఏపీ సీఎం జగన్‌ మండిపడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని ఆరోపించారు. ఇప్పుడు తాము డెయిరీని తెరిపిస్తున్నామని చెప్పారు. ఈ రోజు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు జగన్‌ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చానని, రూ.182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీ ఓపెన్‌ చేస్తున్నామని చెప్పారు. అమూల్‌ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని అన్నారు.

చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదని మండిపడ్డారు. ‘‘చంద్రగిరిలో గెలవలేమని చంద్రబాబు కుప్పం వలస వెళ్లాడు. ఆయన గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారు. మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడు. ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామా చేస్తున్నారు’’ అంటూ జగన్‌ మండిపడ్డారు.

54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను చంద్రబాబు అమ్మేశారని ఆరోపించారు. తన మనుషులకు తక్కువ ధరకు కట్టబెట్టేశారన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని చంద్రబాబు నమ్మకమని ఎద్దేవా చేశారు. ఆయన మంచిని నమ్ముకోకుండా మోసాన్ని నమ్ముకున్నారని విమర్శించారు. తన వల్ల మంచి జరిగితేనే తనకు తోడుగా ఉండాలని ప్రజలను జగన్ కోరారు. 

తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయని జగన్ ఆరోపించారు. దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు.

More Telugu News