Mallu Bhatti Vikramarka: వైఎస్ కుటుంబం కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఎవరూ అడ్డుచెప్పరు: భట్టి

Mallu Bhatti welcomes YS family into Congress
  • వైఎస్ కుటుంబం పుట్టిందే కాంగ్రెస్ లో అన్న మల్లు భట్టి
  • ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆ కుటుంబం కాంగ్రెస్ కు దూరమైందని వ్యాఖ్య
  • కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి బట్టబయలైందన్న కాంగ్రెస్ నేత
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆమె ఢిల్లీకి వెళ్లి, అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ఆమె వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిల చేరిక వార్తలపై స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్టీవీ ఛానల్ తో మాట్లాడారు.

వైఎస్ కుటుంబం పుట్టిందే కాంగ్రెస్ లో అని చెప్పారు. ఆ కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తామంటే అభ్యంతరం చెప్పేవారు ఎవరూ ఉండరన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆ కుటుంబం కాంగ్రెస్ కు దూరమైందని చెప్పారు. షర్మిల పార్టీ విలీనం అంశం అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. అయితే పార్టీలో చేరుతామనే వార్తలు మీడియాలో చూస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ... మంత్రి ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి బట్టబయలైందన్నారు. అమిత్ షా, మోదీ, కేటీఆర్, కేసీఆర్ పరస్పర ప్రయోజనాలు చూసుకుంటున్నారన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వస్తామంటే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
YS Sharmila

More Telugu News