Nallapureddy: పవన్ కల్యాణ్ ఇదే మాట రాజశేఖర్ రెడ్డి మీద కూడా వాడాడు.. !: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

Nallapureddy fires on Pawan Kalyan
  • వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఫైర్
  • చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నారన్న నల్లపురెడ్డి
  • చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి పవన్ ను కొనుక్కున్నారని వెల్లడి
  • పవన్ అంతటి దిగజారుడు భాష మాట్లాడే వ్యక్తిని ఇంతవరకు చూడలేదని వెల్లడి
వారాహి యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి పవన్ కల్యాణ్ ను కొనుక్కున్నారని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను వారాహి ఎక్కి చదువుతున్నాడని మండిపడ్డారు. 

తమ కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉందని, కానీ పవన్ అంతటి దిగజారుడు భాష మాట్లాడే రాజకీయ నేతను ఇంతవరకు చూడలేదని అన్నారు. గుడ్డలు ఊడదీసి కొడతాను, తాట తీస్తాను అని మాట్లాడుతున్నాడని, పవన్ గతంలో ఇవే మాటలు రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఉపయోగించాడని నల్లపురెడ్డి ఆరోపించారు. అయితే, ప్రజలు రెండు చోట్ల ఓడించి ఎవరి బట్టలు ఊడదీసి తరిమికొట్టారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. 

"అసలు... ఈ బట్టలూడదీసి కొట్టడం ఏంటి? ఎక్కడ నేర్చుకున్నావు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. చిరంజీవి వంటి పెద్దమనిషికి చెడ్డపేరు తెస్తున్నావు. నీ కారణంగా నిన్ను కన్న తండ్రి పరువుపోతోంది. 

గతంలో నేను సవాల్ విసిరితే పత్తా లేకుండా పోయావు. నువ్వు మాట్లాడేది కనీసం నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోనో, వైజాగ్ పిచ్చాసుపత్రిలోనో ఉంటే మంచిది" అంటూ నల్లపురెడ్డి నిప్పులు చెరిగారు. కోవూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నాడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను చంద్రబాబు కొట్టించాడని, పవన్ కనీసం ముద్రగడకు మద్దతుగా మాట్లాడలేదని విమర్శించారు. కనీసం ముద్రగడను పలకరించలేదని, కానీ వైసీపీ నేతలు ముద్రగడను పరామర్శించారని నల్లపురెడ్డి వెల్లడించారు. రైలు దహనం కేసులు కూడా జగన్ ఎత్తేశారని తెలిపారు. కాపులందరూ తన వెంట నడుస్తారని పవన్ భ్రమపడుతున్నాడని, కానీ చివరికి మిగిలేది పవన్ ఒక్కడేనని స్పష్టం చేశారు. కాపులందరూ మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని నల్లపురెడ్డి తెలిపారు.
Nallapureddy
Pawan Kalyan
YSRCP
Janasena

More Telugu News