Amit Shah: 2024లో మోదీ 300కు పైగా సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తారు: విపక్షాలకు అమిత్ షా కౌంటర్

Amit Shah takes a jibe at opposition leaders meeting in Patna
  • పాట్నాలో ఫొటో సెషన్ నడుస్తోందంటూ ఎద్దేవా
  • ప్రధాని మోదీని, ఎన్డీయేను సవాల్ చేస్తున్నారు కానీ విజయం తమదేనని ధీమా 
  • బీజేపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవశ్యకత ఉందని వ్యాఖ్య 
పాట్నాలో శుక్రవారం వాటి విపక్షాల భేటీపై బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. అది ఒక ఫోటో సెషన్ అంటూ ఎద్దేవా చేశారు. వారు ప్రధాని మోదీని, ఎన్డీయేను సవాల్ చేస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ఓ విషయం చెప్పదలుచుకున్నానని... 2024లో మళ్లీ బీజేపీయే విజయం సాధిస్తుందని, 300కు పైగా సీట్లతో మోదీ మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. ఆయన జమ్ములో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... 2024లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవశ్యకత ఉందన్నారు.

ఇప్పటి వరకు మోదీపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం రూ.12 లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జమ్మూ కశ్మీర్ సహా వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని, ఇందుకు మోదీ పాలనే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాపై కూడా అమిత్ షా నిప్పులు చెరిగారు. ఇక్కడ 42,000 మంది మృతికి కారణం ఎవరో తెలియదా? అని వారిని నిలదీశారు. కశ్మీర్ వ్యాలీలో తీవ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం రూపుమాపిందన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో జమ్ము, కశ్మీర్ అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇక్కడ ప్రతి పౌరుడికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించినట్లు చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సరికొత్త కశ్మీర్ ను చూస్తున్నామన్నారు. అంతకుముందు జమ్ము బీజేపీ కార్యాలయంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
Amit Shah
BJP

More Telugu News