Tamilnadu: 10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా.. ప్రముఖ దర్శకుడి సంచలన ప్రకటన

  • హాలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టరెంటినో బాటలోనే తానూ వెళతానన్న సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
  • తనకు ఇండస్ట్రీలోనే శాశ్వతంగా ఉండిపోవాలనేమీ లేదని వ్యాఖ్య
  • ఒక్క కథతో సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడం కష్టమని వెల్లడి
  • తాను కలిసి పనిచేసిన నిర్మాతలు, దర్శకుల వల్లే సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైందని కామెంట్
Lokesh kanagaraj says he will quit film making after 10 movies

ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పది సినిమాలు చేసిన తరువాత తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కనగరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. హాలీవుడ్ లెజెండ్ క్వింటెన్ టరెంటినోలా తానూ పది సినిమాలు చేసిన తర్వాత ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానన్నారు. 

‘‘నాకు సుదీర్ఘ ప్రణాళికలు ఏమీ లేవు. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనీ లేదు. సినిమాలు తీసేందుకు ఇక్కడకు వచ్చా. మొదట షార్ట్ ఫిల్మ్స్ తీశా. కాస్త పట్టుచిక్కాక దీన్నో వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాల వరకూ చేస్తా. ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. ఒక కథలో సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. ప్రతి సినిమాకు సంబంధించి నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. నాతో పని చేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు! వారి వల్లే సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైంది. ఎల్‌సీయూ (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) లో పది సినిమాలు వస్తాయేమో చూద్దాం. రెండోసారి విజయ్ అన్నతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన తాజా చిత్రం లియోను జులై కల్లా పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

More Telugu News