Pawan Kalyan: ద్వారంపూడీ... నిన్ను గెలవనివ్వను: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on MLA Dwarampudi
  • కాకినాడలో వారాహి యాత్ర
  •  పవన్ కల్యాణ్ బహిరంగ సభ
  • స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడిపై నిప్పులు చెరిగిన జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ద్వారంపూడి ముఖ్యమంత్రి అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ద్వారంపూడి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉందని విమర్శించారు. 

"ఇదే ప్రాంతానికి చెందిన అగ్నికుల క్షత్రియుడు, మత్స్యకార వర్గానికి చెందిన సత్యలింగ నాయకర్ 1800 సంవత్సరంలోనే బర్మా వెళ్లి బాగా డబ్బు సంపాదించి, ఆ డబ్బు ఇక్కడికి తీసుకువచ్చి ఓ ట్రస్టు స్థాపించి అన్ని కులాల వారికి కాలేజీలు స్థాపించాడు. ఆ స్థలాలను కూడా ఈ ద్వారంపూడి కొట్టేశాడు. ఏ మూలకు వెళ్లినా ఈ ఎమ్మెల్యే దోపిడీ కనిపిస్తుంది. ఈ రౌడీ, గూండా చంద్రశేఖర్ రెడ్డికి చెబుతున్నాను... ఈసారి ఎన్నికల్లో నిన్ను గెలవనివ్వను. ఇక్కడికే వచ్చేశా... మంగళగిరిలోనే ఉంటా. ఏ గూండా వస్తాడో రమ్మనండి... చూసుకుందాం" అంటూ పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరికలు చేశారు. 

ద్వారంపూడీ... గుర్తుపెట్టుకో.... నీ పతనం మొదలైంది. నీ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు.... నా పార్టీ జనసేన కాదు అంటూ అంటూ పవన్ తొడ కొట్టారు. ఒళ్లు పొగరెక్కి కొట్టుకుంటున్నావా... మారేందుకు ఓ చాన్స్ ఇస్తున్నా... మారకపోతే ఎస్పీ టీటీ నాయక్ మీ తాతకు బేడీలు వేసి లాక్కెళ్లినట్టు నీక్కూడా భీమ్లానాయక్ సినిమా చూపిస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నిన్న కాకినాడ జనవాణి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మీద చాలా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. బియ్యం స్మగ్లింగ్ లోనే ద్వారంపూడి 15 వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు చెబుతున్నారని వివరించారు.  ఇలాంటి కోన్ కిస్కా గాళ్ల మీద తనకేమీ వ్యక్తిగత కోపం ఉండదని, క్రిమినల్స్ గా ఉంటూ పాలిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. 

"రెండున్నర సంవత్సరాల కిందట ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. జనసేన నేతలు, వీరమహిళలు, జనసైనికులు ద్వారంపూడి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే రౌడీ మూకలు మావాళ్లపై దాడులు చేశారు. ఆ రోజు నేను ఒక్క మాట అనుంటే ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. క్రైమ్ కు పాల్పడేవాడు ఏ కులమైనా వదిలేది లేదు... రాష్ట్రంలో ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలకు భద్రత ఉండాలి, కుల చిచ్చు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను" అని తన మనోభావాలను పంచుకున్నారు.
Pawan Kalyan
Dwarampudi Chandrasekhar Reddy
Kakinada
Varahi Yatra
Janasena

More Telugu News