Congress: హిందూదేశ నిర్మాణానికి ఐక్యం కావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వెంటనే స్పందించిన పార్టీ

Chhattisgarh Congress MLA Aneeta Sharma calls for Hindu Rashtra
  • హిందూ దేశం కోసం ప్రతిజ్ఞ చేయాలన్న ఎమ్మెల్యే అనీతా శర్మ
  • అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్న కాంగ్రెస్
  • తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న ఎమ్మెల్యే
  • బీజేపీపై మండిపాటు
హిందూ దేశం ఏకం కావాలంటూ చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనీతా శర్మ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పూరి శంకరాచార్య, స్వామి నిశ్చలానంద సరస్వతి జయంతిని పురస్కరించుకుని ధర్సివా నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. హిందూ దేశ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘మనందరం.. ఎక్కడున్నా హిందూ దేశం కోసం ప్రతిజ్ఞ చేయాలి. మనం హిందువుల గురించి మాట్లాడాలి. అందరూ కలిసి వస్తేనే అది సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తక్షణం స్పందించింది. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎమ్మెల్యే కూడా స్పందించారు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

వివిధ మతాలకు చెందిన ప్రజలు ఎంతో సామరస్యంగా జీవిస్తున్నారని, దీనిని చెడగొట్టాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ నేత రాహుల్ గాంధీ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు సమాజాన్ని విడగొట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress
Aneeta Sharma
Chhattisgarh
Hindu Rashtra

More Telugu News