big asteroids: భూమి వైపు దూసుకొస్తున్న రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు!

Two big asteroids nearly a kilometer wide headed toward Earth Nasa tracking closely
  • ఒకటి ఈ నెల 12న, మరొకటి 15న భూమికి చేరువలోకి 
  • కిలోమీటరు విస్తీర్ణంలో వీటి పరిమాణం
  • ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తల పరిగణింపు
కిలోమీటరు వ్యాసార్థంతో ఉన్న రెండు భారీ గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. అయితే, ఇవి భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు ప్రకటించారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న క్రమంలో ఇవి భూమికి సమీపానికి రాబోతున్నాయి. వీటి చుట్టు కొలత 500 నుంచి 850 మీటర్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. సౌరవ్యవస్థ ఏర్పడిన క్రమంలో రాతి శకలాలు ఇలా వేరు పడి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. వీటిని గ్రహ శకలాలు అని పిలుస్తుంటారు.

ఈ గ్రహ శకలాలను 488453 (1994 ఎక్స్ డీ), 2020 డీబీ5గా పిలుస్తున్నారు. ఇందులో 488453 (1994 ఎక్స్ డీ) సోమవారమే అంటే ఈ నెల 12న భూమికి సమీపానికి రానుంది. గంటకు 77,292 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోంది. భూమికి ఇది 31,62,498 కిలోమీటర్ల సమీపానికి రానుంది. ఇది చివరిగా 2012 నవంబర్ 27న భూమికి చేరువగా వచ్చి వెళ్లింది. తిరిగి 2030 లో భూమికి చేరువగా రానుంది.

2020 డీబీ5 గ్రహ శకలం ఈ నెల 15న భూమికి 43,08,418 కిలోమీటర్ల సమీపంగా రానుంది. గంటకు 34,272 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది చివరిగా 1995లో ఇలా భూమికి దగ్గరగా వచ్చింది. మళ్లీ 2048లోనే ఇలా జరగనుంది. ఈ రెండింటి వ్యాసార్థం 150 మీటర్లకు మించి ఉన్నందున వీటిని ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. వీటి గమనంపై నాసా ఓ కన్నేసి ఉంచింది.
big asteroids
kilometer wide
toward Earth
Nasa

More Telugu News