Marnus Labuschagne: ప్యాడ్లు కట్టుకుని కుర్చీలోనే కునుకు తీసిన లబుషేన్.. వికెట్ పడటంతో ఉలిక్కిపడి లేచి.. వీడియో వైరల్

Marnus Labuschagne Wakes Up In Time For Batting After David Warners Dismissal During WTC Final
  • ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య కొనసాగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్
  • ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స‌మ‌యంలో నిద్రపోయిన ల‌బుషేన్
  • వార్నర్ ఔట్ కావడంతో లేచి.. నిద్రమత్తులోనే గ్రౌండ్ లోకి
జరుగుతున్నది ఆషామాషీ మ్యాచ్ కాదు.. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్.. వికెట్ పడితే తర్వాత బ్యాటింగ్ కి రావాలి. కానీ ఇతడేమో.. ప్యాడ్లు కట్టుకుని, కుర్చీలో కూర్చొని తాపీగా నిద్రపోతున్నాడు. ఎంతైనా టెస్టు క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కదా మరి. ఇదంతా ఆస్ట్రేలియా బ్యాట‌ర్ మార్న‌స్ ల‌బుషేన్‌ గురించే.

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోంది. మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న స‌మ‌యంలో ల‌బుషేన్ కాసేపు కునుకు తీశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న చైర్‌లో అత‌ను నిద్రపోయాడు. దీంతో అతడిపై కెమెరాలు ఫోకస్ పెట్టాయి. 

ఇదే స‌మ‌యంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔట‌య్యాడు. దీంతో ఫ్యాన్స్ అరుపుల శబ్దానికి నిద్ర‌లో ఉన్న ల‌బుషేన్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాడు. వెంటనే లేచి బ్యాట్ ప‌ట్టుకుని నిద్రమత్తులోనే మైదానంలోకి వ‌చ్చేశాడు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోను ఐసీసీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం అది వైర‌ల్ అవుతోంది.

లబుషేన్ కునుకు తీస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ‘సెంచరీ గురించి కల కంటున్నాడేమో’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఘటనపై స్పందించిన లబుషేన్.. ‘‘బంతికి బంతికి మధ్య ఉండే విరామ సమయంలో కళ్లకు విశ్రాంతిని ఇస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే 300 పరుగులకు పైగా భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది.
Marnus Labuschagne
Australia
Cricket australia
Team India
WTC Final
David Warner

More Telugu News