Mrigasira Karthe: మృగశిర ఎఫెక్ట్.. కొండెక్కిన కొరమీను ధర!

  • చేపల మార్కెట్లకు పోటెత్తిన జనం
  • రూ. 600 పలుకుతున్న కొరమీను ధర
  • మిగతా చేపల ధరలదీ అదే దారి
  • అయినా తగ్గేదేలే అంటూ కొనుగోళ్లు
  • హైదరాబాద్‌లో ఇప్పటికే 3 లక్షల కిలోలకు పైగా చేపల విక్రయం
Fish Rates High In Hyderabad In The Eve Of Mrigasira Karthe

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లో చేపలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే మంచిదన్న కారణంతో తెల్లవారుజాము నుంచే జనం చేపల మార్కెట్లకు పోటెత్తారు. ఫలితంగా వాటి ధరలు కొండెక్కాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే దాదాపు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. ధరలతో సంబంధం లేకుండా చేప దక్కితే చాలన్న ఉద్దేశంతో ఎంత ధర పెట్టేందుకైనా జనం సిద్ధమయ్యారు. ఫలితంగా సాధారణ రోజుల్లో రూ. 320-400 మధ్య ఉండే కొరమీను చేప ధర నేడు రూ. 500 నుంచి రూ. 600 పలికింది. బొచ్చ, రవ్వు చేపల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. 

మృగశిర కార్తె రావడంతో ఎండల నుంచి జనానికి ఉపశమనం లభిస్తుంది. అయితే అప్పటి వరకు ఎండను తట్టుకున్న శరీరం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చేపలు శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోకుండా చేస్తాయి. క్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చి అనారోగ్యం పాలుకాకుండా కాపాడతాయి. మృగశిర కార్తె తొలి రోజున చేపలు తినాలని చెప్పడం వెనక ఉన్న కారణం ఇదే.

More Telugu News