america: నేను అమాయకుడిని.. ఏ తప్పూ చేయలేదు: డొనాల్డ్ ట్రంప్

Donald Trump says Iam innocent on face federal charges
  • క్రిమినల్ కేసుల విషయంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ కామెంట్
  • ఈ పరిస్థితిని కలలో కూడా ఊహించలేదన్న డొనాల్డ్ ట్రంప్
  • ప్రెసిడెంట్ గా పోటీ పడకుండా ఏ శక్తీ తనను అడ్డుకోలేదని స్పష్టత
అగ్రరాజ్యం అమెరికాకు ప్రెసిడెంట్ గా సేవలందించిన డొనాల్డ్ ట్రంప్ పై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. పదవి నుంచి దిగిపోయాక వైట్ హౌస్ ఖాళీ చేస్తూ పలు కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లాడని ట్రంప్ పై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. వాషింగ్టన్ లో దాడులు చేసేందుకు అనుచరులను ప్రోత్సహించడం సహా ట్రంప్ ఇప్పటికే పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించిన విచారణకు ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. 

తనపై మరో కేసు నమోదు చేయడంపై ట్రంప్ గురువారం స్పందించారు. తాను అమాయకుడినని, ఏ తప్పూ చేయలేదని తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ లో పోస్టు చేశారు. ఓ మాజీ అధ్యక్షుడికి ఈ పరిస్థితి ఎదురవుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు బనాయించి తనను అధ్యక్ష పదవి రేసులో నుంచి తప్పించాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలో అవినీతితో నిండిపోయిన బైడెన్ సర్కారు హస్తం ఉందని విమర్శించారు. 

అయితే, 2024లో జరిగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో పోటీ పడకుండా ఏ శక్తీ తనను అడ్డుకోలేదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు ఇదొక చీకటి రోజని ట్రంప్ వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా నేడు వేగంగా పడిపోతోందని, దీనికి బైడెన్ అవినీతి సర్కారే కారణమని మండిపడ్డారు. అయితే, మనమంతా కలిసి అమెరికాకు పునర్వైభవం తీసుకురావచ్చని ప్రజలను ఉద్దేశించి కామెంట్ చేశారు.

ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు..

ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయాక వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ప్రభుత్వ పత్రాలను తనతో తీసుకెళ్లారని అధికారులు ఆరోపిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను ఆయన తన ప్రైవేటు కార్యాలయంలో దాచేసారని అంటున్నారు. ఈ విషయంలో ట్రంప్ పై క్రిమినల్ కేసు నడుస్తోంది. 2021లో ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ లో అల్లర్లకు పాల్పడ్డారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓటమిని తట్టుకోలేక తన అనుచరులను హింసకు ఉసిగొల్పారని ట్రంప్ పై మరో కేసు దాఖలైంది. గతేడాది పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇది కూడా అమెరికాలో ఆందోళనలకు దారితీసింది.
america
Donald Trump
federal charges
truth social

More Telugu News