Priyanka Gandhi: యూపీ రాజకీయాల నుండి ప్రియాంక గాంధీ బయటకు వస్తున్నారా...?

  • హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం
  • 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంకను ఒకే రాష్ట్రానికి పరిమితం చేయవద్దని కాంగ్రెస్ పెద్దల ఆలోచన
  • జాతీయస్థాయిలో విస్తృతంగా ప్రియాంక సేవలు వినియోగించుకోవాలనే ప్లాన్
  • రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుండి వచ్చాక నిర్ణయం
Congress likely to take Priyanka off UP for a bigger national role

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్ కే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్న ప్రియాంక గాంధీని 2024 లోక సభ ఎన్నికల కోసం విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక యూపీలో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కానీ పార్టీలోని థింక్ ట్యాంక్ వచ్చే ఎన్నికల నాటికి ఆమెను కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం చేయకూడదని భావిస్తోంది.

అయితే రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో ప్రచారం నిర్వహించారని, కాంగ్రెస్ గెలుపుకు ఇది దోహదపడిందని చెబుతున్నారు. ప్రియాంక పార్టీలో కీలక పాత్రను పోషించాల్సిన అవశ్యకత ఉందని సీనియర్ నేతలు భావిస్తున్నారు.

అయితే ఉత్తర ప్రదేశ్ లో విపక్షాల పొత్తు ఎలా ఉంటుందో తేలిన తర్వాతే ప్రియాంక రోల్ ఏమిటనేది తెలుస్తుందని అంటున్నారు. యూపీలో కాంగ్రెస్ పొత్తుతో వెళ్తే ప్రియాంక గాంధీ ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తారని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో యూపీలో కాంగ్రెస్ ఒంటరిగా వెళ్తే పరిస్థితులు మారుతాయని అంటున్నారు.

ప్రియాంక గాంధీ యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే ఆ స్థానంలో ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, సీనియర్ నేత తారిఖ్ అన్వర్, కేంద్ర మాజీ మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్, దీపేందర్ హుడా తదితరులు ఆమె స్థానాన్ని భర్తీ చేయవచ్చునని చెబుతున్నారు.

2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఆమెను యూపీ ఇంచార్జ్ గా నియమించారు. ఆ సమయంలో యూపీలోని అమేథి నుండి పోటీ చేసిన ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పొందారు. రాహుల్ ఆ ఎన్నికల్లో అమేథితో పాటు కేరళలోని వాయనాడ్ నుండి కూడా పోటీ చేశారు. వాయనాడ్ నుండి ఎంపీగా గెలిచారు. 2019లో రాయ్ బరేలి నుండి సోనియా గాంధీ మాత్రమే గెలిచారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది.

అయితే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో రాహుల్, ప్రియాంకలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ పై ప్రియాంక గాంధీ దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు.

More Telugu News