Chandrababu: అంగన్వాడీ టీచర్ మృతిపై డీజీపీ సహా పలువురికి చంద్రబాబు లేఖ

  • హనుమాయమ్మ మృతిపై డీజీపీతో పాటు జాతీయ కమిషన్లకు లేఖ
  • మృతిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్
  • మృతురాలి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలన్న బాబు
Chandrababu letter to DGP about Anganwadi teacher murder

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత భార్య, అంగన్వాడీ టీచర్ హనుమాయమ్మ మృతిపై డీజీపీతో పాటు పలువురు అధికారులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు కూడా లేఖలు రాశారు. ఎస్సీ మహిళ మృతిపై జోక్యం చేసుకోవాలని డీజీపీని కోరారు. ఈ మృతిపై కేంద్ర దర్యాఫ్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనలో వైసీపీ నేతలకు పోలీసుల సహకారంపై కూడా దర్యాఫ్తు జరగాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె కూతురుకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. 

టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుధాకర్ భార్య హనుమాయమ్మను సోమవారం కొండల్రావు అనే వ్యక్తి ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేశాడు. హనుమాయమ్మ అంగన్వాడీ టీచర్ గా పని చేస్తోంది. స్థానిక వైసీపీ నేత కొండల్రావు, టీడీపీ నేత సుధాకర్ కుటుంబాలకు మధ్య పొలం తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఉన్న హనుమాయమ్మను కొండల్రావు ట్రాక్టర్ కు ఉన్న గొర్రుతో ఢీకొట్టడంతో ఆమె కిందపడింది. ఆమె ఇంకా ప్రాణాలతో ఉందేమో అని భావించి ట్రాక్టరును ఆమె పైకి ఎక్కించాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

More Telugu News