Bandi Sanjay: టీడీపీ, బీజేపీ పొత్తు వార్తలు.. ఊహాగానాలేనన్న బండి సంజయ్

  • ఇటీవల షా, నడ్డాలను కలిసిన చంద్రబాబు
  • కలిస్తే తప్పేంటన్న బండి సంజయ్
  • పొత్తు ప్రచారం బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రన్న బీజేపీ తెలంగాణ చీఫ్
BJP Telangana Chief Bandi Sanjay Clarifies About BJP TDP Tie Up

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీలో పర్యటించి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరిందంటూ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని, పొత్తు వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. 

నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడిన ఆయన ఈ పొత్తు వార్తలపై స్పష్టత నిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండడంతో దానిని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుల హోదాలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్‌కుమార్ కూడా మోదీ, అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నెలాఖరు వరకు జరిగే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేతలకు బండి పిలుపునిచ్చారు.

More Telugu News