South Korea: క్రైం టీవీ షోలు అంటే పిచ్చి.. కుతూహలం తట్టుకోలేక హత్య చేసేసిన మహిళ

  • దక్షిణకొరియాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • హత్య అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం  
  • మనసును అదుపు చేసుకోలేక ఓ అమాయకురాలిని బలితీసుకున్న వైనం
  • హోం ట్యూటర్ల యాప్‌లో పరిచయమైన మహిళ ఇంటికెళ్లి మరీ హత్య 
  • యువతి ప్రయాణించిన ట్యాక్సీ డ్రైవర్‌కు అనుమానం రావడంతో గుట్టురట్టు
Young woman obessed with crime tv shows committs murder out of curiosity

దక్షిణకొరియాలో తాజాగా ఓ అసాధారణ ఘటన వెలుగు చూసింది. క్రైం టీవీ షోలకు బానిస అయిపోయిన ఓ యువతికి హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోయింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన ఆమె చివరకు ఓ అమాయకురాలిని బలితీసుకుంది. ఇటీవల నిందితురాలు తాను నేరం చేసినట్టు అంగీకరించడంతో శుక్రవారం పోలీసులు ఆమెపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. 

జంగ్ యూ జంగ్ అనే 23 ఏళ్ల యువతికి క్రైం టీవీ కార్యక్రమాలు, పుస్తకాలంటే మహా అభిమానం. ఈ పిచ్చిలో పడిపోయిన ఆమె చివరకు హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించింది. రాను రాను పెరుగుతున్న కుతూహలాన్ని అణచుకోలేక చివరకు దారుణానికి పూనుకుంది. హత్య ఎలా చేయాలో పక్కగా ప్లాన్ రూపొందించుకున్న నిందితురాలు..ప్రైవేటు ట్యూటర్ల కోసం ఉద్దేశించిన ఓ యాప్‌ ద్వారా ఓ ఉపాధ్యాయురాలిని తన బలిపశువుగా ఎంచుకుంది. 

తన కూతురికి ట్యూషన్ చెప్పాలంటూ తొలుత బాధితురాలిని యువతి యాప్ ద్వారా సంప్రదించింది. ఆ తరువాత తన కూతురు మీ వద్దకే వస్తుందని బాధితురాలిని నమ్మించింది. ఆ తరువాత ఓ రోజు బాలిక వేషంలో నిందితురాలే స్వయంగా మహిళ ఇంటికి వెళ్లింది. ఆ తరువాత ఆమెను దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేసుల్లో సర్ది సమీపంలోని ఓ అడవిలో విసిరేసింది. మహిళ అదృశ్యమైందని చిత్రీకరించేందుకు వీలుగా ఆమెకు సంబంధించి గుర్తింపు కార్డులు, ఫోన్లు తానే తీసేసుకుంది. అయితే, నిందితురాలిని ట్యూటర్ ఇంటి వద్ద దింపిన ట్యాక్సీ డ్రైవర్‌కు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

మహిళా ట్యూటర్‌ను చంపినందుకు బాధగా ఉందని చెప్పిన జంగ్.. హత్య అనుభవం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలనే ఇదంతా చేసినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో, నిందితురాలికి మానసిక రుగ్మతలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు వైద్య పరీక్షలు జరిపిస్తున్నారు.

More Telugu News