Nara Lokesh: ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి వైసీపీ మూకల పనే: నారా లోకేశ్

Nara Lokesh condemns attack attempt on Anam Venkata Ramana Reddy
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటనపై టీడీపీ అగ్రనాయకత్వం తీవ్రంగా స్పందించింది. 

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి వైసీపీ మూకల పనే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతాం అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన ఇచ్చారు. 

టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి అనాగరికం: అచ్చెన్నాయుడు 

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడడం అనాగరికం, అప్రజాస్వామికం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. సైకో చర్యలకు సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. 

"జగన్ తీరు చూస్తుంటే జర్మనీలో నాజీల దురాగతాలను కళ్లకు కడుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరమా? ఎంత సేపు ప్రశ్నించే వారిని వేధించడం, అణచి వేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా? అని హైకోర్టు పదే పదే ప్రశ్నించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది.

జగన్  తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జన్యాలను, దోపిడి విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారు. జగన్ మోహన్ రెడ్డి సాధిస్తున్న దమనకాండకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉంది. దాడిచేసిన నిందతులను వెంటనే అరెస్ట్ చేసి... ఆనంకు తగిన భద్రత కల్పించాలి" అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 
 
 పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం: యనమల 

టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పట్టపగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం యనమల విమర్శించారు. ఇలాంటి దాడులతో భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల అని స్పష్టం చేశారు. 

తమపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతాం అని యనమల ఉద్ఘాటించారు. ఆనంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 


Go Back to Shorts
Nara Lokesh
Anam Venkata Ramana Reddy
Attack
TDP
Nellore

More Telugu News