Jogi Ramesh: మంత్రి జోగి రమేశ్ అనుచరులమంటూ వీరంగం.. భక్తులపై దాడి!

  • ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దర్శనానికి వెళ్లిన భక్తులు
  • రెండు కార్లలో వచ్చి మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు
  • తర్వాతా బస్సులను వెంటాడి.. మంత్రి జోగి రమేశ్ అనుచరులమంటూ దాడికి దిగిన వైనం
  • కార్లకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్.. రాజీ చేసిన పోలీసులు 
minister jogi ramesh followers attacked pilgrims in ntr district

దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న యాత్రికులపై మంత్రి జోగి రమేశ్ అనుచరులు దాడికి దిగారు. విజయవాడ జాతీయ రహదారిపై బస్సులకు అడ్డుగా ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్న కార్లను పెట్టి, దౌర్జన్యానికి దిగారు. మహిళలని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టారు. యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. యువకులపై దాడి చేసి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫోన్ చేశారు. కానీ న్యాయం చేయాల్సిన పోలీసులు.. తమను బెదిరించి అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికారని బాధితులు వాపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జరిగిందీ ఘటన.

పల్నాడు జిల్లా ఫిరంగిపురానికి చెందిన భక్తులు రెండు బస్సుల్లో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దర్శనానికి వెళ్లారు. అదే ఆలయానికి ఇబ్రహీంపట్నానికి చెందిన 8 మంది యువకులు రెండు కార్లలో వచ్చారు. ఆయా కార్లకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్లు కూడా ఉన్నాయి. బస్సులో వచ్చిన మహిళలు, యువతులతో యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. తోటి భక్తులు వారిని వారించడంతో స్వల్ప ఘర్షణ, వాగ్వాదం చోటుచేసుకుంది. వాహనాల పార్కింగ్ విషయంలోనూ బస్సుల డ్రైవర్‌తో యువకులు గొడవకు దిగారు.

బస్సులో భక్తులు తిరిగి వెళ్తుండగా.. కార్లలో వచ్చిన యువకులు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపై కాపుకాసి బస్సులను అటకాయించారు. కార్లు అడ్డుపెట్టి ఆపేశారు. బస్సులో ఉన్న వారిపై దాడికి దిగారు. తాము మంత్రి జోగి రమేశ్‌ అనుచరులమని, చంపేస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు. మహిళలు, యువతులతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులకు ఫోన్‌ చేస్తామంటే ఓ యువకుడిని కొట్టి ఫోన్‌ లాక్కున్నారని చెప్పారు.

బాధితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం గురించి తెలుసుకుని వెంటనే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు రంగంలోకి దిగారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు తీసుకుకోకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలు వచ్చాయి.

దీంతో కేసు నమోదు చేయాల్సి వస్తే, ఇరువర్గాలపై నమోదు చేయాల్సి వస్తుందని పోలీసులు తమను బెదిరించారని బాధితులు వెల్లడించారు. దాడికి పాల్పడిన యువకులు విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తాము ఫిర్యాదు చేయడం లేదని పోలీసులు బాధితుల వద్ద లేఖ రాయించుకుని ఎవరినీ అరెస్ట్ చేయకుండా వదిలేశారు. మరోవైపు గొడవ జరిగినప్పుడు కార్లకు నంబర్‌ ప్లేట్లు ఉన్నాయని, జూపూడిలో మాత్రం వాటిని తీసివేశారని బాధితులు ఆరోపించారు. దాడికి పాల్పడిన యువకుల కార్లపై ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉండటం గమనార్హం.

More Telugu News