NDRF: ప్రమాదం జరిగిన అరగంటలోపే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్.. కారణం ఓ ఉద్యోగేనట!

NDRF employee in coramandal express quick reaction after train accident
  • సెలవుపై వెళుతున్న ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగి
  • కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం
  • ప్రమాదంపై ఉన్నతాధికారులకు సమాచారం చేరవేత
ఒడిశా రైలు ప్రమాదం జరిగిన తర్వాత సుమారు అరగంటలోపే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) మొదటి బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ పనులు వేగంగా మొదలు పెట్టింది. ఈ బృందం అంత త్వరగా అక్కడికి చేరుకోవడానికి కారణం ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ ఉద్యోగేనని అధికారులు వెల్లడించారు. సెలవుపై ఇంటికి వెళ్లడానికి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన సదరు ఉద్యోగి.. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందిచడంతోనే తాము వేగంగా స్పందించగలిగామని చెప్పారు.

ఎన్డీఆర్ఎఫ్ జవాన్ వెంకటేశన్ (39) తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు సెలవుపై ఇంటికి వెళుతున్నాడు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో బీ7 కోచ్ లో ప్రయాణిస్తున్నాడు. రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో రైలు ప్రమాదానికి గురైంది. వెంకటేశన్ ఉన్న బోగీలో ప్రమాద తీవ్రత పెద్దగా లేకపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బోగీలో నుంచి బయటకు వచ్చాక ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు, తనపై అధికారులకు ఫోన్ లో సమాచారం అందించాడు.

వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసి వెంకటేశన్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాడు. బోగీలలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులకు సూచనలు చేస్తూ బాధితులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. వెంకటేశన్ అందించిన సమాచారంతో తాము వెంటనే స్పందించామని, బాలాసోర్ లోని రీజనల్ రెస్పాన్స్ సెంటర్ ను అప్రమత్తం చేశామని ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మొహిసీన్ షాహెదీ చెప్పారు.
NDRF
Quick Responce
coramandal express
odisha train accident
balasore
Releaf teams

More Telugu News