colombia: ఆ కీకారణ్యంలో ఆ చిన్నారులు ఎక్కడున్నారో!

  • కొలంబియాలో విమాన ప్రమాదం.. నలుగురు పిల్లలు మిస్సింగ్
  • నెల రోజులు గడిచినా చిక్కని ఆచూకీ
  • కొనసాగుతున్న ఆపరేషన్ హోప్
  • వంద మంది సైనికులు, 70 మందికి పైగా వలంటీర్ల వెతుకులాట
search operation still continues for missing kids in amazon forest in colombia

కొలంబియాలో విమాన ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోయాయి.. రెండు వారాల తర్వాత విమానం శకలాలు, పైలట్ సహా ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను అధికారులు గుర్తించారు. అయితే, అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారుల జాడ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. సుమారు వంద మంది సిబ్బందితో అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ హోప్’ ఇంకా కొనసాగుతూనే ఉంది. పిల్లలు బతికే ఉన్నారనే సంతోషకరమైన వార్త వెల్లడించిన ఈ బృందానికి వారు ఎక్కడ ఉన్నారు, ఎటుగా ప్రయాణిస్తున్నారనేది గుర్తించడం మాత్రం కష్టంగా మారింది.

భయంకరమైన క్రూర మృగాలు సంచరించే అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పిల్లలను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ఇప్పటికే సుమారు 1,500 కిలోమీటర్లమేర నడిచాయి. వీరితో పాటు 70 మందికి పైగా వలంటీర్లు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఇన్ని రోజులు గడిచినా పిల్లల ఆచూకీ దొరకకపోవడంపై అధికారులు స్పందిస్తూ.. విమాన ప్రమాదంతో భయపడిపోయిన పిల్లలు అడవిలో నుంచి బయటపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.

దారీతెన్నూలేని ఈ అడవిలో ఎటువెళుతున్నారో తెలియని పిల్లలను వెతకడం అంత సులభం కాదన్నారు. ఏదేమైనా పిల్లలను క్షేమంగా బయటకు తీసుకొస్తామని అధికారులు వివరించారు. కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కూడా ఇదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పిల్లలు దొరుకుతారని చెప్పారు.

అసలేం జరిగిందంటే..
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఓ కుటుంబం అమెజాన్ అటవీ ప్రాంతం మీదుగా చిన్న విమానంలో బయలుదేరింది. మే 1న అరారాక్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గ్వావియారె ప్రాంతానికి వెళుతుండగా మధ్యలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇంజన్ ఫెయిల్ అయి విమానం కూలిపోయింది. ప్రమాదానికి ముందు విమానం కూలిపోతున్న విషయాన్ని పైలట్ కన్ఫర్మ్ చేసినట్లు దగ్గర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే ఈ విమానం రాడార్ పరిధి నుంచి గల్లంతయ్యింది. 

దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కూలిపోవడంతో రెస్క్యూ పనులకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. రెండు వారాల పాటు గాలించాక విమాన శకలాలను గుర్తించారు. విమానంలో బయలుదేరిన ఏడుగురిలో పెద్దవారు ముగ్గురూ చనిపోయారని, వారి మృతదేహాలను విమానం కూలిన ప్రాంతంలోనే గుర్తించామని అధికారులు చెప్పారు. అయితే, 13, 9, 4 ఏండ్ల చిన్నారులతో పాటు 11 నెలల పసికందు కూడా కనిపించకుండా పోయారని వివరించారు.

పిల్లలు చనిపోయినట్లు ఎలాంటి ఆధారం దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో వారికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టగా.. పదిహేను రోజుల తర్వాత పిల్లల కాలి గుర్తులతో పాటు వారు తిని పడేసిన ఓ పండును రెస్క్యూ టీమ్ గుర్తించాయి. దీంతో పిల్లలు బతికే ఉన్నారని ప్రకటించాయి. ఈ ప్రకటనతో కొలంబియా మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. అయితే, రోజులు గడుస్తున్నా పిల్లల ఆచూకీ మాత్రం చిక్కక పోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News