cm kcr: ఉద్యమ నాయకత్వం చారిత్రాత్మకం.. నా జన్మధన్యమైంది.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో సీఎం కేసీఆర్

  • గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం
  • సెక్రటేరియట్ లో జాతీయ జెండాను ఎగరవేసి, గౌరవ వందనం స్వీకరణ
  • ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని వెల్లడి
Cm KCR speech at telangana secretariat

‘‘తొలిదశ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు కుట్రలతో అణచివేశారు.. దీంతో జనాల్లో అలముకున్న నిర్వేదాన్ని బద్దలు కొడుతూ 2001లో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక బాధ్యత నాకు లభించింది. దీంతో నా జీవితం ధన్యమైంది’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేసి, భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మలి దశ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఒక్కటిగా తెలంగాణ సాధించుకునేందుకు పోరాడారని చెప్పారు.

శాంతియుతంగా జరిగిన ఉద్యమంలో మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు కలిసి నడిచారని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. 

2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిర్మించిన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రజల కోరికలను, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు చేసిన, చేస్తున్న కృషిని పేర్కొన్నారు. ప్రతీ రంగంలోనూ యావత్ దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధిస్తూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ చెప్పారు.

More Telugu News