Amit Shah: అక్రమ ఆయుధాలను అప్పగించండి.. లేదంటే కఠిన చర్యలు తప్పవు: మణిపూర్ లో అమిత్ షా హెచ్చరికలు

manipur violence surrender illegal weapons now amit shah warns rioters
  • మణిపూర్‌ ఘర్షణలపై హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందన్న అమిత్ షా
  • హింసకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుందని వెల్లడి
  • రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమవుతుందని ప్రకటన
దాదాపు నెల రోజులుగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు, అల్లర్లతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడికిపోతోంది. గొడవలు సద్దుమణిగాయని భావించే లోపు.. గత ఆదివారం మళ్లీ పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మణిపూర్ వెళ్లారు. గత సోమవారం రాత్రి నుంచి ఆయన అక్కడే మకాం వేశారు.

ఆయుధాలను అక్రమంగా తమ వద్ద ఉంచుకున్న వాళ్లు వెంటనే తమకు అప్పగించాలని అమిత్ షా అన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. ఈ హింసకు సంబంధించిన ఆరు కేసులను కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. దాదాపు నెలరోజులుగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఘర్షణల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని చెప్పారు. 

‘‘మూడు రోజులుగా నేను ఇంఫాల్, మోరె, చురాచాంద్‌పుర్‌ సహా పలు ప్రాంతాల్లో పర్యటించాను. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా స్థానిక అధికారులతో మాట్లాడాను. మణిపూర్ గవర్నర్‌ నేతృత్వంలో పీస్‌ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ఘటనల వెనుక ఉన్న కుట్రలను గుర్తించేందుకు ఉన్నతస్థాయి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాం. ఈ దర్యాప్తు పూర్తి తటస్థంగా ఉంటుందని హామీ ఇస్తున్నా’’ అని వివరించారు.

మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల పరిహారాన్ని అందిస్తాయని అమిత్ షా తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హోం శాఖకు చెందిన చెందిన ఉన్నతస్థాయి అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు. నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ‘‘అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే వాటిని పోలీసులకు అప్పగించాలి. రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎవరివద్ద అయినా ఆయుధాలు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని చెప్పారు.
Amit Shah
Manipur
Violence
Surrender illegal weapons

More Telugu News