Kodela Sivaram: పల్నాడు టీడీపీలో కలకలం .. చంద్రబాబును తిట్టిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారన్న కోడెల శివరాం

  • సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జీగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం
  • కన్నా మూడు పార్టీలు మారి టీడీపీలోకి వచ్చారని శివరాం విమర్శ
  • చంద్రబాబు పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్య
Kodela Sivaram fires on Kanna Lakshminarayana

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీగా కన్నా లక్ష్మీనారాయణను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. దీంతో, వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా అనే విషయం స్పష్టమయింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేస్తున్న తనను పక్కన పెట్టడంపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ తో శివరాం మాట్లాడుతూ, కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. పదవి ఇస్తే ఒక పార్టీ, ఇవ్వకపోతే మరొక పార్టీ అనేది కన్నా విధానమని విమర్శించారు. ఇప్పటికే మూడు పార్టీలను మారి చివరకు టీడీపీలోకి వచ్చారని దుయ్యబట్టారు. పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసిన తన తండ్రికి, కన్నాకు పోలిక ఏమిటని ప్రశ్నించారు. 

ఒకానొకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయం కోడెల వర్సెస్ కన్నా అన్నట్టుగా జరిగేదని... టీడీపీ కార్యకర్తలు, నేతలపై కన్నా కేసులు పెట్టించి, ఇబ్బందులకు గురి చేస్తుంటే... కోడెల శివప్రసాద్ అందరినీ కాపాడేవారని చెప్పారు. ఇదే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబును కూడా ఏక వచనంతో సంబోధిస్తూ, దుర్భాషలాడారని అన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వకపోయినా, గౌరవాన్ని మాత్రం తగ్గించకూడదని శివరాం అన్నారు. 

తనను నమ్ముకున్న వారి కోసం తాను నిలబడతానని, తన మద్దతుదారులు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తానని చెప్పారు. చంద్రబాబు పిలిచి మాట్లాడతారని ఎదురు చూస్తున్నామని తెలిపారు. చంద్రబాబుకు తెలియకుండానే ఈ పరిణామాలు జరిగుతున్నాయని, తమకు చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. చంద్రబాబును కలిసేందుకు మూడేళ్ల నుంచి తాను, తన తల్లి ప్రయత్నిస్తున్నామని... అయనను కలవకుండా పల్నాడు జిల్లా అధ్యక్షుడు అడ్డుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News