Mahesh Babu: మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ పై మహేశ్ బాబు హృదయ స్పందన

  • తెలుగు సినిమాని హాలీవుడ్ ప్రమాణాలకు మించి చూపించారన్న మహేశ్ బాబు
  • 52 ఏళ్ల క్రితమే సాహసోపేతంగా సినిమాలు తీసినట్టు వెల్లడి
  • ప్రతి కొత్త టెక్నాలజీని తెలుగు సినిమాకి పరిచయం చేశారంటూ కితాబు 
Mahesh Babu pens emotional note as his dads Mosagallaku Mosagadu re releases in theatres

నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. 1971లో వచ్చి బాక్సాఫీసు వసూళ్లలో రికార్డులు సృష్టించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని మరోసారి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 4కే టెక్నాలజీ సాయంతో దీన్ని తిరిగి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ నట వారసుడు మహేశ్ బాబు భావోద్వేగంతో ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

‘‘నా తండ్రికి అతిపెద్ద అభిమానుల్లో నేను కూడా ఒకడిని. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై అభిమానుల కోసం సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. మోసగాళ్లకు మోసగాడు పట్ల ప్రత్యేకమైన ప్రేమ, ఆరాధన వున్నాయి. నాన్నగారు ఎంతో సాహసోపేతమైన వ్యక్తి. తెలుగు సినిమాను హాలీవుడ్ ప్రమాణాల కంటే ఉన్నతమైనదిగా చూపించారు. ఆ రోజుల్లోనే బ్లాక్ బస్టర్ తీశారు. 52 ఏళ్ల క్రితం గుర్రాలు, గన్ ఫైట్ లు, భారీ సెట్టింగులు, అందమైన లొకేషన్లు, నిధి కోసం వేట, కౌబోయ్ గెటప్.. ఈ సినిమాని 50 దేశాల్లో కేవలం తెలుగు ప్రేక్షకులకే కాకుండా ఇంగ్లిష్, హిందీ, తమిళ్, బెంగాలీలోనూ చూపించిన ఘనత నాన్నగారికే దక్కింది’’ అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. 

‘‘మా నాన్న ఓ లెజెండ్. దార్శనికత ఉన్న వ్యక్తి. ప్రతి నూతన టెక్నాలజీని తెలుగు సినిమాకి పరిచయం చేశారు. మొదటి స్టీరియో సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70ఎంఎం, మొదటి జేమ్స్ బాండ్ సినిమా, మొదటి కౌబోయ్ సినిమా’’ అంటూ పోస్ట్ పెట్టాడు.

More Telugu News