Rains: ఏపీలో పలు జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం

  • బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
  • ఈ మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడిమి
  • వర్షంతో చల్లబడిన వాతావరణం
  • నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరులో జిల్లాల్లో వర్షాలు
  • పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం
Sudden change in AP weather

ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు... మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. కమ్ముకు వచ్చిన మేఘాలు, ఈదురు గాలులు, వర్షంతో వాతావరణం చల్లబడింది. 

నెల్లూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల కటౌట్లు కూలిపోయాయి... ఫ్లెక్సీలు ధ్వంసం అయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కావలి, కందుకూరు, గూడూరు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తిరుపతి జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురిసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలోనూ ఈ మధ్యాహ్నం కురిసిన వర్షంతో ప్రజలు సేదదీరారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో ఏపీలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

More Telugu News