China: చైనాలో రికార్డ్ స్థాయికి యువత నిరుద్యోగిత రేటు

China Youth Unemployment Hits Record High At 20 Per Cent
  • మరో నెలలో జాబ్ మార్కెట్లోకి 11.6 మిలియన్ల మంది విద్యార్థులు 
  • జీరో - కోవిడ్ విధానంతో ఆర్థికంగా చితికిపోయిన డ్రాగన్ దేశం
  • కొత్త గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వేతనం రూం అద్దెకు మాత్రమే సరిపోతుందని విమర్శలు 
చైనాలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో దేశంలో 16-24 ఏళ్ల మధ్య వయసున్న వారి నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 20.4 శాతానికి చేరుకుందని చైనా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నట్లు ఖబర్‌హబ్ తెలిపింది. మరో 11.6 మిలియన్ల మంది విద్యార్థులు కాలేజీ, వృత్తి విద్యా పాఠశాలల నుండి గ్రాడ్యుయేట్ కానున్నారు. అంటే వీరు జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు జాబ్ మార్కెట్ లోకి ప్రవేశించడానికి ఒక నెల ముందు గణాంకాలు విడుదలయ్యాయి.

చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ విధానంతో లాక్‌డౌన్ విధించింది. దీంతో ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ నాన్సీ కియాన్ ఈ ఖబర్‌హబ్ నివేదికలో తెలిపారు. ఈ నివేదికల ప్రకారం చైనా ఆర్థిక పునరుద్ధరణలో ఇతరుల కంటే వెనుకబడి ఉంది. అమెరికాలో 2020లో మహమ్మారి సమయంలో నిరుద్యోగిత రేటు గరిష్ఠంగా 14.85 శాతానికి చేరుకుంది. 2021లో 9.57 శాతానికి తగ్గినట్లు ఖబర్ హబ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో యువత నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది.

చైనాలో కరోనా పరిస్థితులు తగ్గాయి. కానీ యువత ఉపాధి రేటును తగ్గించడానికి ప్రాథమిక పరిస్థితులు మాత్రం మెరుగుపడటం లేదు. 16 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య వయస్సు వారు పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించడం లేదు. దీనిని యువ నిరుద్యోగితగా చెబుతారు. 2021 సర్వే ప్రకారం.. షాంఘై, బీజింగ్ వంటి పెద్ద నగరాల్లో కొత్త గ్రాడ్యుయేట్‌లకు నెలకు సగటున 749 డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. ఈ వేతనం 269 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకోవడానికి సరిపోతుంది.
China
job
employement

More Telugu News