Chennai Super Kings: జడేజా నువ్వు తోపు... ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్

  • సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన ఐపీఎల్ ఫైనల్
  • ఆఖరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి గెలిపించిన జడేజా
  • గుజరాత్ టైటాన్స్ ను 5  వికెట్ల తేడాతో ఓడించిన ధోనీ సేన 
  • చెన్నై ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్
  • ముంబయి ఇండియన్స్ రికార్డును సమం చేసిన సీఎస్కే
Chennai Super Kings claims fifth IPL title

ఐపీఎల్ 16వ సీజన్ కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆఖరి బంతి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచింది. 

ఆఖరి రెండు బంతుల్లో చెన్నై జట్టుకు 10 పరుగులు కావాల్సి ఉండగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ సిక్సర్, ఓ ఫోర్ కొట్టి చెన్నైకి ఐదో ఐపీఎల్ టైటిల్ అందించాడు. జడేజా ఈ మ్యాచ్ లో కొట్టింది 6 బంతుల్లో 15 పరుగులే అయినా, చెన్నైకి టైటిల్ దక్కడానికి ఆ పరుగులే తోడ్పడ్డాయి. 

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడడంతో, డీఎల్ఎస్ ప్రకారం చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. 

లక్ష్యఛేదనలో చెన్నై జట్టుకు ఘనమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. గైక్వాడ్ 26, కాన్వే 47 పరుగులు సాధించి సరైన పునాది వేశారు. వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే చివరి వరకు క్రీజులో నిలిచి 32 పరుగులు చేశాడు. రహానే 27 పరుగులు చేయగా... ఐపీఎల్ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న తెలుగుతేజం అంబటి రాయుడు 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేసి మ్యాచ్ లో చెన్నై అవకాశాలను సజీవంగా నిలిపాడు. 

ఇక చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా... మోహిత్ శర్మ మొదటి మూడు బంతులను యార్కర్లు వేయడంతో క్రీజులో ఉన్న దూబే, జడేజా 2 పరుగులే తీయగలిగారు. నాలుగో బంతి 'లో హైట్' ఫుల్ టాస్ వేసినా శివమ్ దూబే సింగిల్ తోటే సరిపెట్టాడు. 

ఇక చివరి రెండు బంతుల్లో 10 పరుగులు  అవసరం కాగా... మోహిత్ శర్మ ఏ లెంగ్త్ లో బంతి వేస్తాడో ముందే పసిగట్టిన జడేజా శక్తికొద్దీ బ్యాట్ ఝుళిపించడంతో బంతి స్టాండ్స్ లో పడింది. ఆఖరి బంతిని మోహిత్ శర్మ లెగ్ సైడ్ విసరగా, జడేజా తెలివిగా ఫోర్ కొట్టి చెన్నై శిబిరంలో సంతోషాల సునామీని సృష్టించాడు. 

విన్నింగ్ షాట్ కొట్టిన జడేజా డగౌట్ వద్దకు రాగానే ధోనీ ఒక్కసారిగా అతడిని పైకెత్తి ఈ విజయం తనకు ఎంత విలువైనదో చాటిచెప్పాడు. ఎందుకంటే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకుండా, బౌలింగ్ ఎంచుకున్న ధోనీ... ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయుంటే తప్పకుండా తన నిర్ణయం పట్ల విమర్శలపాలయ్యేవాడు. జడేజా తన అమోఘమైన బ్యాటింగ్ విన్యాసాలతో ధోనీ ముఖంలో నవ్వులు విరబూయించాడు. 

కాగా, మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తన కెరీర్ లో ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్. దాంతో రాయుడు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. అతడిని ఇతర ఆటగాళ్లు ఆత్మీయంగా హత్తుకుని వీడ్కోలు పలికారు.

ఇక, జడేజా వీరోచిత ఇన్నింగ్స్ ను కళ్లారా చూసిన అతడి అర్ధాంగి రివాబా స్టాండ్స్ లో ఆనందబాష్పాలు రాల్చింది. చెన్నై డగౌట్ వద్దకు వచ్చి జడేజాను సంతోషంతో హత్తుకుంది. టైటిల్ గెలవడంతో చెన్నై ఆటగాళ్ల సంబరాలు అన్నీ ఇన్నీ కావు. మైదానం అంతా కలియదిరిగి అభిమానులను ఉత్సాహపరిచారు. 

ఓవరాల్ గా ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5వ ఐపీఎల్ టైటిల్. చెన్నై జట్టు గతంలో 2010, 2011, 2018, 2021 సీజన్లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్ తో చెన్నై సూపర్ కింగ్స్... ముంబయి ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేసింది. ముంబయి ఇండియన్స్ ఐదు పర్యాయాలు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 

కాగా, 2023 ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ.13 కోట్లు అందుకోనుంది.

More Telugu News