Siddaramaiah: సిద్ధరామయ్య కేబినెట్లోకి 24 మంది కొత్త మంత్రులు.. ఎవరెవరు, ఏయే సామాజికవర్గాలకు చెందినవారంటే..?

24 new Mlas take oath as Karnataka ministers
  • సిద్దూ, డీకేలతో కలిసి 34కు చేరిన మంత్రుల సంఖ్య
  • ఆరుగురు లింగాయత్ లు, నలుగురు వొక్కలిగలకు చోటు
  • తొమ్మిది మంది ఎస్సీలకు మంత్రి పదవులు
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ను పూర్తి స్థాయిలో విస్తరించింది. ఈ నెల 20న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు మరో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఖ్యాతసంద్ర రాజన్న, శరణబసప్ప దర్శనపూర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపూర్, ఎస్ఎస్ మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, శరణ ప్రకాశ్ రుద్రప్ప పాటిల్, మంకుల్ వైద్య, లక్ష్మి హెబ్బాల్కర్, రహీమ్ ఖాన్, డీ సుధాకర్, సంతోశ్ లాడ్, ఎన్ఎస్ బోస్ రాజు, బీఎస్ సురేష, మధు బంగారప్ప, ఎంసీ సుధాకర్, బి నాగేంద్ర, చెలువరాయ స్వామి, దినేశ్ గుండూరావ్, ఈశ్వర్ ఖండ్రే, హెచ్ సీ మహదేవప్ప, కే వెంకటేశ్, హెచ్ కే పాటిల్, కృష్ణ బైరేగౌడ ఉన్నారు. 

మంత్రులుగా బాధ్యతలను స్వీకరించిన వారిలో ఆరుగురు లింగాయత్ లు, నలుగురు వొక్కలిగలు ఉన్నారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఐదుగురు ఓబీసీలు కూడా ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి దినేశ్ గుండూరావ్ కు ప్రాతినిధ్యం లభించింది. మొత్తం మీద తొమ్మిది మంది ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఓల్డ్ మైసూరు, కల్యాణ కర్ణాటక ప్రాంతాల నుంచి ఏడుగురు చొప్పున కేబినెట్ లో బెర్త్ సంపాదించుకున్నారు. కిట్టూరు కర్ణాటక ప్రాంతం నుంచి ఆరుగురికి, సెంట్రల్ కర్ణాటక నుంచి ఇద్దరికి అవకాశం లభించింది.
Siddaramaiah
Karnataka
Congress
Cabinet

More Telugu News