Supreme Court: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై పిల్.. విచారణకు స్వీకరించని సుప్రీంకోర్టు!

Supreme Court dismisses plea seeking inauguration of new Parliament building by President Murmu
  • వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాదిపై సుప్రీం అసహనం
  • ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో తమకు తెలుసని వ్యాఖ్య
  • ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించాలని హెచ్చరిక
  • పిల్ ను విత్ డ్రా చేసుకుంటానన్న అడ్వకేట్
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ను భారత రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని.. దీనిపై లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. అయితే ఈ పిల్ పై విచారణ జరిపేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ వేసిన పిల్ పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో మాకు తెలుసు. దీన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘మీకు ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.

వ్యాజ్యాన్ని కొట్టివేయాలని బెంచ్ నిర్ణయించింది. ఈ సమయంలో పిటిషనర్ స్పందిస్తూ.. తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. ‘‘వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో పిటిషనర్ కొంతసేపు వాదించిన తర్వాత.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Supreme Court
new Parliament building
President Of India
Droupadi Murmu
Prime Minister
Narendra Modi

More Telugu News