Jogi Ramesh: టీడీపీని ఆ సెంటు స్థలంలోనే సమాధి చేస్తారు: ఏపీ మంత్రి జోగి రమేశ్

minister jogi ramesh serious comments on chandrababu naidu
  • 51 వేల మందికి పైగా రేపు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్న జోగి రమేశ్
  • పేదలకు భూములు ఇవ్వాలంటూ ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్య
  • చంద్రబాబు నయా జమీందారీ వ్యవస్థ తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపణ
చంద్రబాబు పెత్తందారీ కోటను బద్దలు కొట్టి.. పేదలకు ఇళ్ల స్థలాలను తాము పంపిణీ చేయబోతున్నామని మంత్రి జోగి రమేశ్ చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. పేదల పక్షాన నిలిచిన జగన్ గెలిచారని అన్నారు. అమరావతిలో జరగబోయే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ రోజు అమరావతిలోని మందడం, పెనుమాకలలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి మంత్రి రమేశ్ పరిశీలించారు. 

సమాధి అంటూ చంద్రబాబు విమర్శించిన ఆ సెంటు స్థలంలోనే.. పేదలు టీడీపీని సమాధి చేయబోతున్నారని చెప్పారు. ‘‘51 వేల మందికి పైగా శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?’’ అని మండిపడ్డారు. పేదలు పనులకు మాత్రమే ఉపయోగపడాలా, అక్కడ నివసించకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నయా జమీందారీ వ్యవస్థ తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు.

పేదలకు పట్టాలు ఇస్తుంటే వద్దని కొందరు మహిళా పెత్తందార్లను అడ్డుకోమంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమరావతి పెత్తందారులు చంద్రబాబును వదిలిపెట్టాలని హితవుపలికారు. పేదలు పేదలుగానే ఉండాలని.. పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుదని మండిపడ్డారు.

పెత్తందార్లకు మేలు చేసేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. పేదలకు భూములు ఇవ్వాలంటూ.. ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లారని, అయినా తమ ప్రభుత్వ విధానమే గెలిచిందని చెప్పుకొచ్చారు.
Jogi Ramesh
Chandrababu
TDP
Amaravati

More Telugu News