Nara Lokesh: త్వరలోనే మన ఆడపులి బయటికి వస్తుంది: లోకేశ్

  • ఆళ్లగడ్డలో భూమా ఘాట్ ను సందర్శించిన లోకేశ్
  • భూమా నాగిరెడ్డి, శోభ దంపతులకు నివాళి
  • ఆళ్లగడ్డలో బహిరంగ సభ
  • తల్లి, తండ్రి లేని పిల్లలను జగన్ వేధిస్తున్నాడని ఆగ్రహం 
  • భూమా అఖిల ప్రియ, విఖ్యాత్ రెడ్డిలకు తామున్నామని భరోసా
Lokesh speech in Allagadda

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజుల పాటు అవిశ్రాంతంగా సాగిన యువగళం పాదయాత్ర మంగళవారం సాయంత్రం జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి, కడప జిల్లా ముఖ్యనేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

కడప జిల్లా సరిహద్దుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు, కార్యకర్తలు యువనేతకు వీడ్కోలు పలికారు. తనను కుటుంబసభ్యుడి మాదిరిగా ఆదరించి ఆప్యాయత కనబర్చిన కర్నూలు ప్రజలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక, ఆళ్లగడ్డ టౌన్ లో పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు పెద్దఎత్తున జనం హాజరయ్యారు. అనంతరం లోకేశ్ భూమా ఘాట్ ను సందర్శించారు. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి స్మృతికి  నివాళులర్పించారు. 

ఆళ్లగడ్డతో పాటు కర్నూలు జిల్లాకు భూమా దంపతులు చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయాలను భూమా అఖిలప్రియ, విఖ్యాత్ రెడ్డిలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం భూమా దంపతులు కన్న కలలను నెరవేస్తున్నారని చెప్పారు. భూమా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు.

ఆ తల్లిని చంపి నేరం నాపై నెడతారేమో!

బాబాయ్ ని లేపేసిన కేసులో దొంగబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు, కడపలో అన్ని ఆసుపత్రులు ఉంటే కర్నూలుకి తెచ్చి డ్రామా మొదలు పెట్టారని లోకేశ్ విమర్శించారు. దొరికిపోయిన దొంగలు గుండెపోటు డ్రామా మొదలు పెట్టారని లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన భారీ బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించారు. 

"అప్పుడు బాబాయ్ కి గుండెపోటు అన్నారు... ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు. వీళ్ల స్వార్ధ రాజకీయం కోసం ఆ తల్లిని ఏం చేస్తారో అని భయం వేస్తుంది. ఆ తల్లిని ఏదైనా చేసి ఆ నెపం నాపై నెడతారేమో అనిపిస్తోంది. ఆ తల్లిని దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను. అవినాశ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ పడింది. త్వరలోనే బాబాయ్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్స్ కూడా జైలుకి పోవడం ఖాయం" అని స్పష్టం చేశారు.

ఆళ్లగడ్డలో లూటీ నాని లీలలు

"ఆళ్లగడ్డను అద్భుతంగా అభివృద్ధి చేస్తాడని మీరు 2019 ఎన్నికల్లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ గంగుల నానిని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. అతనో చేతగాని ఎమ్మెల్యే. ఆళ్లగడ్డను అడ్డంగా దోచుకోవడం తప్ప చేసింది ఏమైనా ఉందా? అందుకే ఆయన పేరు మార్చాను. ఆయన గంగుల నాని కాదు లూటీ నాని. లూటీ నాని స్వయంగా ఇంటినే సెటిల్మెంట్ డెన్ గా మార్చేసుకున్నాడు. 

ఆళ్లగడ్డలో ఐ ట్యాక్స్ అంటే అందరికీ బాగా తెలుసు. మహిళల్ని మనం గౌరవించాలని పేరు చెప్పడం లేదు. కానీ ఐ ట్యాక్స్ తో మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు. ఇసుక, ఎర్రమట్టి, కాంట్రాక్టులు, లిక్కర్ దందా, అక్రమ బియ్యం రవాణా...ఇలా ప్రతి దాంట్లో లూటీ చేస్తూ లూటీ నాని దాదాపు 200 ఎకరాలు కొన్నాడని వైసీపీ నాయకులు, కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు"

దేవుడ్ని కూడా వదలని నాని

"లూటీ నాని ఆఖరికి దేవుడ్ని కూడా వదలలేదు. అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దందా చేస్తున్నారు. అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెత్తనం చెయ్యాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. లూటీ నాని అభివృద్ధి చెయ్యడు... వేరే వాళ్ళు చేసినవి ఉంచడు. ఆళ్లగడ్డలో దివంగత భూమా నాగిరెడ్డి ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ కడితే... ఆయనకు పేరు వస్తుందని డ్రైనేజీ నిర్మాణం పేరుతో బస్ షెల్టర్ కూల్చారు"

టీడీపీ కేడర్ ను వేధించే వాళ్లను వదలం

"ఆళ్లగడ్డను అభివృద్ధి చేసిన భూమా కుటుంబాన్ని జగన్ వేధిస్తున్నాడు. తల్లి, తండ్రి లేని పిల్లల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నాడు. త్వరలోనే మన ఆడపులి బయటకు వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అఖిల ప్రియ మీ కోసం పోరాడుతూనే ఉంటుంది. మీ తరపున పోరాడుతున్న విఖ్యాత్ రెడ్డి మీద కేసులు పెట్టి వేధించారు. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదలం. అందరికి వడ్డితో సహా చెల్లిస్తాం. ఆళ్లగడ్డలో ఉన్నా, అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి లోపలేస్తాం"

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1393 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.9 కి.మీ.

109వ రోజు (24-5-2023) పాదయాత్ర వివరాలు:

జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం(కడప జిల్లా)
మధ్యాహ్నం
02.00  – సుద్దపల్లె క్యాంప్ సైట్ లో గండికోట, రాజోలు రిజర్వాయర్ నిర్వాసితులు, రైతులతో ముఖాముఖి.
సాయంత్రం
04.00  – సుద్దపల్లె క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
05.15  – జంగాలపల్లి వద్ద రైతులతో సమావేశం. 
05.35  – జె.కొత్తపల్లి వద్ద ముస్లింలతో సమావేశం.
06.50  – ఉప్పలూరు వద్ద స్థానికులతో సమావేశం.
08.05  – నిమ్మలదిన్నెలో పాదయాత్ర 1400 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
08.30  – నిమ్మలదిన్నెలో స్థానికులతో సమావేశం.
10.00  – ఎన్.కొత్తపల్లిలో స్థానికులతో సమావేశం.
10.15  – ఎన్.కొత్తపల్లి శివారు విడిది కేంద్రంలో బస.
**

More Telugu News