Manish Sisodia: సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు: ఆప్ నేతల ఫైర్

  • లిక్కర్ స్కాంలో సిసోడియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు
  • రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు
  • ఓ పోలీసు సిసోడియా మెడ పట్టుకుని నెట్టుకెళుతున్న దృశ్యాలు వైరల్
AAP leaders alleges police misbehave with Manish Sisodia

లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, సిసోడియాను ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా పోలీసుల వైఖరి తీవ్ర విమర్శపాలైంది. ఓ పోలీసు సిసోడియాను దాదాపు మెడ పట్టుకుని నెట్టుకుంటూ వెళుతున్నట్టుగా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

ఆప్ సీనియర్ నేత ఆతిషి దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో, పోలీసులపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియో ఫుటేజిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఓ పోలీసు సిసోడియా పట్ల తప్పుగా ప్రవర్తించాడని మండిపడ్డారు. అతడిని ఢిల్లీ పోలీసు విభాగం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కోర్టులో సిసోడియా పట్ల పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఢిల్లీ పోలీసు విభాగం పేర్కొంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలాంటి ఆరోపణలు చేయడం నిబంధనలకు విరుద్ధం అని, వాస్తవానికి ఆ పోలీసు సిసోడియాను కోర్టు హాల్లోకి తీసుకువచ్చేటప్పుడు భద్రతా కారణాల రీత్యా పట్టుకుని నడిపించాడని ఆ ట్వీట్ లో వివరించారు. 

కాగా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఈ వ్యవహారంలో స్పందిస్తూ, వాళ్ల బాస్ (కేంద్ర హోంమంత్రి అమిత్ షా) ను సంతృప్తి పరిచేందుకు ఢిల్లీ పోలీసులు ఇలా అనైతికంగా వ్యవహరించారని పరోక్ష విమర్శలు చేశారు. 

అంతేకాదు... సిసోడియా పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, కానీ తీవ్ర ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖరన్ పట్ల ఎంత మర్యాదగా వ్యవహరించారో చూడండి... అంటూ ఆ మేరకు ఆప్ ఓ వీడియో పోస్టు చేసింది. మోదీ సర్కారు కక్ష సాధింపు వైఖరికి ఇదే నిదర్శనమని పేర్కొంది.

More Telugu News