Suvendu Adhikari: బెంగాల్‌లో పరిస్థితి ఉక్రెయిన్ కంటే దారుణం: సువేందు అధికారి

Situation in Bengal worse than Ukraine Suvendu Adhikari slams Mamata Banerjee
  • బిర్భూమ్‌ జిల్లాలో స్థానిక టీఎంసీ నేత ఇంట్లో భారీ పేలుడు
  • ఉక్రెయిన్‌తో పోలిస్తే బెంగాల్‌లోనే ఎక్కువ పేలుళ్లు జరుగుతున్నాయన్న బీజేపీ నేత
  • రాష్ట్రంలో కంటే ఉక్రెయిన్‌లోని పరిస్థితులే బాగున్నాయని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో మోదీ 400కుపైగా సీట్లు సాధిస్తారన్న సువేందు అధికారి
మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ మరోమారు అటాక్ ప్రారంభించింది. రాష్ట్రంలోని పరిస్థితులు ఉక్రెయిన్ కంటే దారుణంగా ఉన్నాయని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. బిర్భూమ్ జిల్లాలో నిన్న ఓ స్థానిక టీఎంసీ నేత ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. ఆదివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ నేపథ్యంలో సువేందు అధికారి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు ఉక్రెయిన్ కంటే దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్‌తో పోలిస్తే ఉక్రెయిన్‌లోనే పేలుళ్లు తక్కువగా ఉన్నాయని అన్నారు. నిజం చెప్పాలంటే అక్కడ పరిస్థితి కొంత ప్రశాంతంగానే ఉందన్నారు. కానీ, రాష్ట్రంలో మాత్రం పేలుళ్లకు తెరపడడం లేదన్నారు. 

అభిషేక్ బెనర్జీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 26న విచారించనుండడంపై సువేందు అధికారి మాట్లాడుతూ.. చట్టం అందరికీ ఒకటేనని పేర్కొన్నారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో మమతా బెనర్జీని, బొగ్గు, గోవుల అక్రమ రవాణా కేసులో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీబీఐ, ఈడీలు ఎందుకు వదిలిపెడుతున్నాయని ప్రశ్నించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రధాని నరేంద్రమోదీ 400 సీట్లుకుపైగా సాధిస్తారని సువేందు జోస్యం చెప్పారు.
Suvendu Adhikari
West Bengal
BJP
TMC
Mamata Banerjee

More Telugu News