Nitish Kumar: ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో బీహార్ సీఎం నితీశ్.. కేజ్రీవాల్ తో మరోసారి భేటీ

bihar cm nitish kumar meets arvind kejriwal in his residence in delhi
  • ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో పాటు వెళ్లి కేజ్రీని కలిసిన నితీశ్
  • ఏప్రిల్ 12న కూడా కేజ్రీవాల్ తో సమావేశమైన బీహార్ సీఎం
  • నిన్న జరిగిన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు
వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ ముమ్మరం చేశారు. ఇటీవల వరుసగా ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, హేమంత్ సోరెన్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే తదితరులతో ఇప్పటికే సమావేశమైన ఆయన.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.

ఆదివారం ఉదయం బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర నేతలతో కలిసి ఢిల్లీకి నితీశ్ చేరుకున్నారు. సివిల్ లైన్స్ లోని కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. భేటీ తర్వాత కేజ్రీవాల్, నితీశ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజల పక్షాన నిలుస్తానని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు నితీశ్ చెప్పారు. 

‘‘ఢిల్లీకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పడంపై నితీశ్ చర్చించారు. ఢిల్లీ ప్రజల పక్షాన నిలుస్తానని చెప్పారు. ఒకవేళ కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను బిల్లుగా తీసుకువస్తే.. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి వస్తే.. రాజ్యసభలో పాస్ చేయకుండా అడ్డుకోవచ్చు. అలా జరిగితే.. 2024లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందన్న సందేశాన్ని పంపవచ్చు’’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఎలా లాగేసుకుంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మేం అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’’ అని నితీశ కుమార్ చెప్పారు. 

మరోవైపు కేజ్రీవాల్, నితీశ్ గత ఏప్రిల్ 12న కూడా భేటీ అయ్యారు. కర్ణాటకలో నిన్న జరిగిన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీశ్ హాజరయ్యారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
Nitish Kumar
Arvind Kejriwal
Bihar CM
JDU
AAP
Congress
BJP

More Telugu News