Sajjala Ramakrishna Reddy: అవినాశ్ నేరస్థుడు కాదు.. తప్పించుకోవడమూ లేదు.. కానీ పచ్చ మీడియా వెంటాడుతోంది: సజ్జల మండిపాటు

  • సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారన్న సజ్జల 
  • ఆయనపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం 
  • తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపి విచారణకు అవినాశ్ డుమ్మా కొట్టే వ్యక్తి కాదని వ్యాఖ్య
  • తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటారని వెల్లడి
  • వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తి కార్లలో తిరుగుతూ సెటిల్ మెంట్లు చేస్తున్నాడని ఫైర్
ysrcp leader sajjala ramakrishna reddy fires on media reaction on ys avinash reddy

సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ రోజు సీబీఐ విచారణకు ఆయన హాజరుకాకపోవడంపై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లికి సీరియస్‌గా ఉందని విచారణకు హాజరుకాలేదని, గతంలో సీబీఐ నోటీసులిచ్చిన ప్రతిసారి అవినాశ్ హాజరయ్యారని గుర్తుచేశారు. 

విచారణకు హాజరయ్యేందుకే అవినాశ్ హైదరాబాద్ కు వచ్చారని, తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి అవినాశ్ ముందే సమాచారం ఇచ్చివుంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. సీబీఐ పిలిచాక ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్లక తప్పదన్నారు. అవినాశ్ నేరస్థుడు కాదని, ఎక్కడికీ పోవడం లేదని, తప్పించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కానీ అవినాశ్ ను పచ్చ మీడియా వెంటాడుతోందని మండిపడ్డారు. నేరస్థుడు తప్పించుకుంటున్నాడన్నట్లుగా ఆయన కాన్వాయ్‌ను ఫాలో అయ్యారని.. ఇది సరికాదన్నారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

తల్లికి అనారోగ్యం ఉందనే సాకుతో విచారణకు డుమ్మా కొట్టే వ్యక్తి అవినాశ్ కాదని.. అసలు వైఎస్ ఫ్యామిలీయే అలాంటిది కాదని సజ్జల అన్నారు. తీవ్ర పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి అవినాశ్ సిద్ధంగా ఉంటారని చెప్పారు. 

‘‘వివేకాను నరికానని చెబుతున్న వ్యక్తి ఈరోజు కార్లలో తిరుగుతూ, ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు. నేరుగా సెటిల్ మెంట్ చేస్తున్నాడు. కానీ ఒక ఎంపీని వెంటాడుతున్నారు’’ అని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. ‘‘వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబం పాత్ర ఉందని చిన్న ఆధారం దొరికినా ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వదిలిపెట్టేవారా? అసలు సీబీఐ గట్టిగా తలచుకుంటే తప్పించుకోగలరా?’’ అని ఆయన ప్రశ్నించారు.

More Telugu News