KCR: క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ఆసుపత్రిలోనే పాఠశాల... సీఎం కేసీఆర్ నిర్ణయం

CM KCR orders to establish special school for Cancer patients children in MNJ Hospital
  • ఎక్కువ రోజుల పాటు సాగే క్యాన్సర్ చికిత్స
  • క్యాన్సర్ బాధితులతో పాటు ఆసుపత్రుల్లో ఉంటున్న పిల్లలు
  • చదువుకు దూరమవుతున్న వైనం
  • ఎంఎన్ జే ఆసుపత్రిలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు
  • సీఎం కేసీఆర్ ఆదేశాలు
క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరం కాకుండా, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 

క్యాన్సర్ చికిత్స సుదీర్ఘకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ బాధితులు ఎక్కువరోజుల పాటు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లి వస్తుండాలి. కొన్నిసార్లు దంపతులు తమ పిల్లలతో కలిసి ఆసుపత్రిలోనే కొన్ని వారాల పాటు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పిల్లల చదువు దెబ్బతింటోంది. 

ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్... హైదరాబాదులోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలోనే పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆలోచనకు తాము సహకారం అందిస్తామని ఎంఎన్ జే ఆసుపత్రి యాజమాన్యం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. 

దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అమ్మ, నాన్న క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే, వారి వెంట వెళ్లే చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారని వెల్లడించారు. దీనిపై మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్... క్యాన్సర్ బాధితులకు చికిత్సతో పాటు వారి పిల్లల చదువు కోసం అక్కడే ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారని హరీశ్ రావు వెల్లడించారు. ఎంఎన్ జే ఆసుపత్రిలో త్వరలో అందుబాటులోకి రానున్న ఈ పాఠశాల వల్ల విద్యార్థుల చదువు నిరాటంకంగా కొనసాగుతుందని తెలిపారు.
KCR
School
Children
Cancer Patients
MNJ Hospital
Hyderabad

More Telugu News