KCR: ఓ అద్భుతం చూశాను.. అది కేసీఆర్ కే సాధ్యం: ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు

  • తెలంగాణ సచివాలయాన్ని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్ 
  • అతి తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్‌లో గొప్పగా నిర్మించారని కితాబు
  • తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోందని వ్యాఖ్య
  • ఈ అభివృద్ధి విషయంలో తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడి
famous writer Vijayendra Prasad praised Telanganas new secretariet

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తన పట్టుదల, ఆకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను కడుతూ ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని కేసీఆర్ నిజం చేస్తున్నారని అన్నారని అన్నారు. ఇటీవల ప్రారంభించిన తెలంగాణ సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ కొన్ని ఫొటోలు దిగారు. 

వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఉందని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ‘‘ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాడిని కాదు.. కానీ స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో, అతి తక్కువ బడ్జెట్‌లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు’’ అని అన్నారు. 

‘‘నిజంగా చెప్పాలంటే కేసీఆర్‌ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం’’ అని చెప్పారు.

కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోందని అన్నారు. ఈ అభివృద్ధి విషయంలో తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణం గురించి విజయేంద్ర ప్రసాద్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News