Kiren Rijiju: ప్రణాళిక మేరకే తప్పించారు..: కిరణ్ రిజిజు

Shifting not punishment but plan Kiren Rijiju after losing law ministry
  • ప్రధాని మోదీ విజన్ లో భాగంగానే మార్పు జరిగిందన్న కిరణ్ 
  • కొత్త శాఖలోనూ ఉత్సాహంగా పనిచేస్తానని ప్రకటన
  • న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు
కేంద్ర న్యాయ శాఖ నుంచి తనను తప్పించడంపై మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రెండేళ్లుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న రిజిజును గురువారం తొలగించి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టడం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖ బాధ్యతలు కేటాయించారు. న్యాయమూర్తుల నియామక కొలీజియం వ్యవస్థపై, రిటైర్డ్ జడ్జీలపై ఆయన చేసిన విమర్శలు, పలు కేసుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం తదితర అంశాలు రిజిజును తప్పించడానికి కారణమై ఉంటాయన్న ప్రచారం నడుస్తోంది. ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శలు గుప్పించాయి. దీంతో కిరణ్ రిజిజు ఈ అంశాలన్నింటిపై స్పందించారు. 

శుక్రవారం ఎర్త్ సైన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. న్యాయ శాఖ నుంచి కొత్త శాఖకు తనను మార్చడం అన్నది శిక్ష విధించడం కాదన్నారు. ప్రభుత్వం ప్రణాళిక మేరకే ఇది చేసినట్టు చెప్పారు. న్యాయ శాఖపై మీడియా వేసిన ప్రశ్నలకు స్పందించలేదు. ప్రతిపక్షాల విమర్శలకు స్పందించారు. ‘‘ప్రతిపక్షం నన్ను తప్పకుండా విమర్శిస్తుంది. నాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడడం కొత్తేమీ కాదు. నన్ను మార్చడం అన్నది శిక్షించడం కాదు. ఇది ప్రభుత్వ ప్రణాళిక. ప్రధాని మోదీ దార్శనికత’’అని రిజిజు స్పష్టం చేశారు. 

మరోవైపు న్యాయ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగిన రిజిజు ఇంతకాలం తనకు సహాయ, సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రధాని మోదీ మార్గదర్శకంలో కేంద్ర న్యాయ మంత్రిగా పనిచేయడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. దేశ పౌరులకు న్యాయ సేవలను సులభంగా అందించడంలో సహాయం చేసిన గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు, జడ్జ్ లు, న్యాయవాదులు, న్యాయాధికారులు అందరికీ ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీజీ విజన్ కు అనుగుణంగా ఎర్త్ సైన్స్ శాఖలోనూ అంతే ఉత్సాహంగా పనిచేస్తాను. వినయపూర్వకమైన బీజేపీ కార్యకర్తగా ఉంటాను’’ అని రిజిజు ప్రకటించారు.
Kiren Rijiju
Shifting
not punishment
law ministry
modi vision

More Telugu News