Payyavula Keshav: టీడీపీ ప్రభుత్వ ఒప్పందాలను జగన్ బుట్టదాఖలు చేయడమే కరెంటు కష్టాలకు కారణం: పయ్యావుల

  • రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందన్న పయ్యావుల
  • చంద్రబాబు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశారని వెల్లడి
  • జగన్ మూడేళ్లలోనే సర్వనాశనం చేశారని విమర్శలు
  • సీఎం, మంత్రివర్గం, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
Payyavula slams CM Jagan

రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని టీడీపీ సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. చంద్రబాబు సోలార్, విండ్, వాటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లను బలోపేతం చేసి, ఏపీని దేశంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపారని... కానీ జగన్ కేవలం మూడేళ్లలోనే తన అనాలోచిత, కక్షసాధింపు నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 

విద్యుత్ ఒప్పందాల ప్రకారం విద్యుత్ కొనుగోళ్లు జరపకుండా, వాటిని కక్ష సాధింపులతో రద్దుచేసి, బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనడం, కమీషన్ల కోసం కాదా? అని పయ్యావుల నిలదీశారు. విద్యుత్ ఒప్పందాలకు విరుద్ధంగా విద్యుత్ కొనుగోళ్లు జరిపి, ప్రజలపై వేల కోట్ల భారం మోపిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం, అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపాలని డిమాండ్ చేశారు. 

మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.12 వేల కోట్ల విద్యుత్ కొనుగోలు చేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపిందని పయ్యావుల ఆరోపించారు. 3 ఏళ్ల క్రితం మిగులు విద్యుత్ లో ఉన్న రాష్ట్రాన్ని మీ ధనదాహంతో మూడున్నరేళ్లలో విద్యుత్ లోటు రాష్ట్రంగా మార్చారు అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

డిస్కంలు దివాలా తీసే స్థితిలో ఉంటే, గృహాలకు స్మార్ట్ మీటర్లు అంటూ ఆ భారాన్ని వాటిపై, ప్రజలపై మోపడం సరైనదేనా? అని ప్రశ్నించారు. 

“విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై కోర్టులకు వెళ్లడంతో, చివరకు వాటికి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. దాంతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్ కొంటే, దానికి రెండుసార్లు డబ్బు చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా? మూడేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దోపిడీచేసిన జగన్ నిర్వాకం అంతిమంగా ప్రజలకు శాపంగా మారింది" అని పయ్యావుల వివరించారు.

More Telugu News