Karnataka: తెలంగాణలో అధికారంలోకి రావడానికి కర్ణాటక దారిలో కాంగ్రెస్!

Congress to use Karnataka playbook for a rerun in Telangana poll
  • బీజేపీని అడ్డుకొని, బీఆర్ఎస్ ను ఓడిస్తామన్న కాంగ్రెస్ నేత
  • తెలంగాణలోను ప్రజా సమస్యలే ప్రధాన అజెండా అని వ్యాఖ్య
  • బీజేపీ ఇప్పుడైనా అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాలని హితవు
కర్ణాటకలోలా ప్రజల్లోకి వెళ్లి తెలంగాణలోను విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కన్నడనాట బీజేపీని ఓడించి, అత్యధిక స్థానాలు గెలిచినట్లు తెలంగాణలోను అధికార బీఆర్ఎస్ పార్టీపై విజయం సాధిస్తామంటున్నారు. కర్ణాటక మాదిరి తెలంగాణలోను బీజేపీని అడ్డుకుంటామని, ప్రజల మేనిఫెస్టోతో తాము ముందుకు వెళ్లి, బీఆర్ఎస్ ను ఓడిస్తామని చెబుతున్నారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. వీటికి ఏడాదికి రూ.62 వేల కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి హామీలు తెలంగాణలో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ణాటక ప్రజలు బీజేపీని తిప్పికొట్టడంతో పాటు తమ పార్టీకి రికార్డ్ మెజార్టీని ఇచ్చారని ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. తమకు తెలంగాణలోని ప్రజల సమస్యలే ప్రధాన అజెండా అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడైనా బీజేపీ కనీసం అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడుతుందని భావిస్తున్నామన్నారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను తాము ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలోను పర్యటించారని, ఈ సమయంలో చాలా విజ్ఞప్తులు వచ్చాయని, వాటి ఆధారంగా ప్రజా సమస్యలే అంశంగా మేనిఫెస్టోను తయారు చేస్తామన్నారు.

బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించడం ఖాయమన్నారు. తాము మొదటి స్థానంలో ఉంటామని, బీఆర్ఎస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడతాయన్నారు. పార్టీని విడిచి వెళ్లిన వారు తిరిగి వచ్చేవారిపై పీసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

అదే సమయంలో కేంద్రంలో మోదీకి ప్రత్యర్థిగా, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని చూపిస్తారా? అని ప్రశ్నించగా, అజెండా ఇష్యూ బేస్డ్ గా ఉంటుందని, కానీ వ్యక్తి ఆధారంగా ఉండదని పవన్ ఖేరా అన్నారు. కర్ణాటకలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తారా? అని ప్రశ్నించగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు.
Karnataka
Congress
Telangana

More Telugu News