Marcus Stoinis: పవర్ హిట్టింగ్ తో విరుచుకుపడిన స్టొయినిస్

  • ఐపీఎల్ లో నేడు లక్నో వర్సెస్ ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసిన లక్నో
  • స్టొయినిస్ 47 బంతుల్లో 89 నాటౌట్
  • 4 ఫోర్లు, 8 సిక్సులు బాదిన వైనం
Stoinis hammers Mumbai Indians bowling

లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ తన ట్రేడ్ మార్క్ పవర్ హిట్టింగ్ తో ఇవాళ ముంబయి ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టొయినిస్ విజృంభణతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టొయినిస్, కెప్టెన్ కృనాల్ పాండ్యా జోడీ మొదట ఆచితూచి ఆడింది. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ముంబయి బౌలర్లపై వీరిద్దరూ ఎదురుదాడికి దిగారు. 

కృనాల్ పాండ్యా 42 బంతుల్లో 49 పరుగులు చేసి రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో స్టొయినిస్ మరింత దూకుడు కనబర్చాడు. స్టొయినిస్ ధాటికి చివరి 5 ఓవర్లలో లక్నో జట్టుకు 69 పరుగులు లభించాయి. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ 2, పియూష్ చావ్లా 1 వికెట్ తీశారు. 

లక్నో ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ దీపక్ హుడా 5 పరుగులకే అవుటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన ప్రేరక్ మన్కడ్ (0) ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు లెఫ్టార్మ్ పేసర్ బెహ్రెండార్ఫ్ ఖాతాలోకి వెళ్లాయి. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 16 పరుగులు చేసి లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు.

More Telugu News