Sunil Gavaskar: షర్టుపై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం పట్ల గవాస్కర్ స్పందన

  • గత ఆదివారం చెన్నైలో కేకేఆర్ చేతిలో ఓడిన సీఎస్కే
  • ఈ సీజన్ లో ధోనీకి సొంతగడ్డ చెపాక్ లో అదే చివరి మ్యాచ్
  • మ్యాచ్ అనంతరం స్టేడియం చుట్టూ కలియదిరిగిన ధోనీ
  • ఆ క్షణాలను చిరస్మరణీయం చేసుకునేందుకే ధోనీ ఆటోగ్రాఫ్ అడిగానన్న సన్నీ
Gavaskar tells why he has taken Dhoni autograph on his shirt

గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ మైదానం అంతా కలియదిరిగాడు. అభిమానులకు అభివాదం చేస్తూ, ప్రేక్షకుల గ్యాలరీల్లో తన గుర్తుగా టెన్నిస్ బంతులను కొడుతూ సీఎస్కే తరఫున చెపాక్ లో ఇదే తన చివరి మ్యాచ్ అన్న సంకేతాలు ఇచ్చాడు. 

ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పరుగు పరుగున వచ్చి ధోనీ ఆటోగ్రాఫ్ కోరడం టెలివిజన్లలో కనిపించింది. దాంతో ధోనీ... గవాస్కర్ ధరించిన షర్టుపైనే తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీనిపై గవాస్కర్ స్పందించారు. 

"చెపాక్ స్టేడియంలో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ కలియదిరుగుతున్న విషయం తెలిసింది. దాంతో ఆ క్షణాలను ఓ మధుర స్మృతిగా మలుచుకునేందుకు ధోనీ వద్దకు పరుగు తీశాను. నా చొక్కాపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాను. ధోనీకి ఈ సీజన్ లో సొంతగడ్డపై అదే చివరి మ్యాచ్. ఒకవేళ సీఎస్కే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయితే చెన్నైలోనే ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ, ధోనీ స్టేడియం చుట్టూ కలియదిరుగుతున్న క్షణాలను చిరస్మరణీయం చేసుకునేందుకే చొక్కాపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాను" అని గవాస్కర్ వివరించారు.

More Telugu News