Karnataka: ఓవర్ టు ఢిల్లీ.. కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే!

As race for Karnataka CM hots up DK Shivakumar and Siddaramaiah in Delhi today
  • సీఎం కుర్చీ కోసం డీకే, సిద్ధరామయ్య వర్గాల పట్టు
  • ఇద్దరినీ ఢిల్లీ పిలిపించుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం
  • ఈ సాయంత్రం ప్రకటన వచ్చే అవకాశం
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించిన కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజారిటీ తెచ్చుకుంది. ఈ విజయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కానీ, ముఖ్యమంత్రి ఎవరనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పోటాపోటీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే దాకా సమైక్యంగా ఉన్నామంటూనే.. ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం కుర్చీ కోసం ఇరువురు నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం భేటీ అయిన సీఎల్పీ ఈ నెల 18న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపింది. కానీ, సీఎం ఎవరో ఖరారు చేయలేకపోయింది. 

మరోవైపు డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ తమ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలు జరిపారు. ఈ క్రమంలో సీఎం ఎవరో తేల్చే విషయాన్ని అధిష్ఠానం తీసుకుంది. డీకే, సిద్ధరామయ్యలను కాంగ్రెస్ అగ్రనేతలు ఈ రోజు ఢిల్లీ పిలిపించుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు సీఎంను తేల్చనున్నారు. పార్టీ సీనియర్ నేతలు రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తో పాటు ముఖ్యమంత్రి నియామక ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ నియమించిన ముగ్గురు పరిశీలకులైన మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బవారియా, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి భన్వర్ జితేంద్ర సింగ్‌ ముందుగానే ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు నివేదిక సమర్పించనున్నారు. సోమవారం సాయంత్రం వరకు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ప్రకటన రానుంది.
Karnataka
Chief Minister
post
DK Shivakumar
Siddaramaiah
New Delhi
Congress

More Telugu News